ఢిల్లీ: థాయిలాండ్-కంబోడియా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదంతో ప్రభావితమైన ప్రాంతంలో విష్ణువు విగ్రహాన్ని కూల్చివేశారనే నివేదికలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో నిర్మించిన విష్ణుమూర్తి విగ్రహాన్ని కూల్చివేసినట్లు మాదృష్టికి వచ్చింది. ఇది కొనసాగుతున్న థాయ్‌లాండ-కంబోడియా సరిహద్దు వివాదంతో ప్రభావితమైన ప్రాంతంలో ఉంది. ఇటువంటి అగౌరవ చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని అన్నారు.
ఈ ప్రాంతం ఉమ్మడి సాంస్కృతిక, నాగరిక బంధాలను నొక్కి చెబుతూ.. దక్షిణ, ఆగ్నేయాసియా అంతటా ప్రజలు హిందూ, బౌద్ధ దేవతలను ఎంతో గౌరవిస్తారని, పూజిస్తారని జైస్వాల్ పేర్కొన్నారు. ఇటువంటి చిహ్నాలు, ఈ ప్రాంతం ఉమ్మడి వారసత్వంలో అంతర్భాగమని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు మతపరమైన, సాంస్కృతిక వారసత్వానికి నష్టం తీవ్రతరం చేస్తుందని, ఉద్రిక్తతలను మరింత పెంచుతుందన్నారు. రెండు దేశాలు చర్చల ద్వారా శాంతిని పునరుద్ధరించాలని, ప్రాణనష్టం, ఆస్తినష్టం, వారసత్వ నష్టం జరగకుండా చూడాలని పిలుపునిచ్చారు.


