ఇది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల(ఎఫ్‌టీఏ) యుగం. మన దేశం ఈ ఏడాది ఇంతవరకూ బ్రిటన్, ఒమన్ దేశాలతో ఎఫ్‌టీఏలపై సంతకం చేసింది. తాజాగా న్యూజిలాండ్‌తో ఎఫ్‌టీఏపై అవగాహన కుదిరింది. మరో మూడు నెలల్లో సంతకాలు కాబోతున్నాయి. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక వాణిజ్య, వాణిజ్యేతర కారణాలతో మన దేశంపై ఎడాపెడా సుంకాలు విధించి తన షరతులకు తలొగ్గటమో, ఆర్థికంగా నష్టపోవటమో తేల్చుకోమని సవాలు విసురుతున్నారు. ఆ నష్టాలను వీలైనంత తగ్గించుకోవటానికి ప్రత్యామ్నాయాలు వెదుక్కునే క్రమంలోనే మన దేశం వివిధ దేశాలతో ఎఫ్‌టీఏలు కుదుర్చుకొనేందుకు ప్రయత్నిస్తోంది. సరుకులు, సేవల్లో ఇరు దేశాల మధ్యా 130 కోట్ల డాలర్ల విలువైన వర్తమాన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాగల అయిదేళ్లలో 500 కోట్ల డాలర్లకు తీసుకెళ్లటం, వచ్చే పదిహేనేళ్లలో భిన్న రంగాల్లో న్యూజిలాండ్ 2,000 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడం భారత్–న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ సారాంశం.
దీని ప్రకారం మన సరుకులన్నిటిపైనా దాదాపు సుంకాలు విధించకుండా ఉండేందుకు న్యూజిలాండ్ అంగీ కరిస్తే, అక్కడినుంచి యాపిల్స్, కివీ పండ్లు, చెర్రీలు, నూలు ఉత్పత్తులు దిగుమతి చేసుకునేందుకు మన దేశం సుముఖత వ్యక్తం చేసింది. కార్మికుల అవసరం ఎక్కువున్న జౌళి, ఆభరణాలు, తోలు, ఆటోమొబైల్స్, ఇంజినీరింగ్, మెరైన్, హస్త కళలు వగైరా ఉత్పత్తులకు న్యూజిలాండ్ తక్కువ సుంకాలు విధిస్తుంది. కొన్నింటి విషయంలో అసలు సుంకాలే ఉండవు. అలాగే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్(స్టెమ్) పట్టభద్రులకు న్యూజిలాండ్‌లో ఉద్యోగావకాశాలుంటాయి. అక్కడి వర్సిటీల్లో చదువుకొనేందుకూ, పరిశోధనలు సాగించేందుకూ మన విద్యార్థులకు వీలుంటుంది. మరో విశేషమేమంటే మన తరఫున ఈ ఒప్పందం సాకారానికి కృషి చేసింది మొత్తంగా మహిళా అధికారుల బృందమే.
ఎఫ్‌టీఏలపై ఆరోపణలూ, విమర్శలూ కూడా లేకపోలేదు. ఆహారం, ఆరోగ్యం, కార్మిక వర్గం, పర్యావరణం తదితర అంశాలపై ఇవి తీవ్రంగా ప్రభావం చూపే అవకాశమున్నా అధిక శాతం ఎఫ్‌టీఏల చుట్టూ గోప్యత అలుముకుని ఉంటుందనీ, ఆచరణ మొదలయ్యాకే వాటి అసలు పర్యవసానాలేమిటో ప్రజలకు తెలుస్తుందనీ సామాజిక కార్యకర్తల ఆరోపణ. తొలి ఆధునిక సమగ్ర ఎఫ్‌టీఏ ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(నాఫ్తా) 1994లో కుదరగా, మన దేశం తొలిసారి 1999లో శ్రీలంకతో ఎఫ్‌టీఏ కుదుర్చుకుంది. అటుతర్వాత జపాన్, మలేసియా, దక్షిణ కొరియా, సింగపూర్, ఆగ్నేయాసియా దేశాల కూటమి ఆసియాన్ వగైరాలతో ఈ ఒప్పందాలు కుదిరాయి. వర్తమాన యుగంలో ఏ దేశమూ ఒంటరిగా మనుగడ సాగించలేదు. ఆత్మ నిర్భర భారత్, మేకిన్ ఇండియా వంటివి స్వావలంబనకు కొంతమేర తోడ్పడవచ్చుగానీ, వాటినే సర్వస్వంగా భావించటం సాధ్యం కాదు.
చిత్రమేమంటే భారత్–న్యూజిలాండ్ ఎఫ్‌టీఏపై సామాజిక రంగాల కార్యకర్తలకన్నా ముందు న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్స్ చిర్రుబుర్రులాడుతున్నారు. న్యూజిలాండ్ డెయిరీ ఉత్పత్తులకు మన మార్కెట్‌ను బార్లా తెరవకపోవటం ఆయనగారికున్న అభ్యంతరం. పార్లమెంటులో ధ్రువీకరణకొచ్చినప్పుడు ఒప్పందాన్ని ప్రతిఘటిస్తామని కూడా ప్రకటించారు. న్యూజిలాండ్ అధికార కూటమి ప్రభుత్వంలో ఆయన పార్టీ భాగస్వామి. ఈ ఏడాది ఇంతవరకూ 2,400 కోట్ల డాలర్ల డెయిరీ ఉత్పత్తులు పాలు, వెన్న, జున్ను వగైరాలు తాము ఎగుమతి చేయగా, ఒక్క భారత్ మాత్రమే అందుకు సమ్మతించటం లేదన్నది ఆయన అభ్యంతరం.
అయితే కుదరబోయే ఈ ఒప్పందం ఒక వెసులుబాటునిస్తోంది. ముడి పదార్థాలు తీసుకొచ్చి ఉత్పత్తులు చేసి వంద శాతం ఎగుమతులు చేసుకునేందుకు న్యూజిలాండ్‌కు అవకాశం ఉంటుంది. డెయిరీ, సాగు ఉత్పత్తులకు అనుమతులిస్తే మన సాగు, పాడి రంగాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలోనే అమెరికా ప్రధానంగా పట్టుబడుతోంది. ఇప్పుడు న్యూజిలాండ్‌తో కుదిరిన అవగాహన చూశాక ట్రంప్ ఏమంటారో చూడాలి. మొత్తానికి మన ప్రయోజనాలు దెబ్బతినకుండా, లబ్ధి చేకూరేలా కుదుర్చుకునే ఏ ఒప్పందమైనా స్వాగతించదగిందే!


