పాక్‌ నేత తిరుగుబాటు.. భారత్‌కు మద్దతు | Pak Leader Slams Own Country Support India | Sakshi
Sakshi News home page

పాక్‌ నేత తిరుగుబాటు.. భారత్‌కు మద్దతు

Dec 24 2025 7:32 AM | Updated on Dec 24 2025 7:34 AM

Pak Leader Slams Own Country Support India

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌కు చెందిన నేత ఒకరు తమ దేశం వ్యవహరిస్తున్న తీరుపై పశ్చాత్తాప ధోరణిలో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌పై పాక్‌ జరిపిన సైనిక దాడులను జమియత్ ఉలేమా ఈ ఇస్లాం ఎఫ్ (జేయూఐ-ఎఫ్‌) చీఫ్ మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ తప్పుబట్టారు. పాక్ సైన్యం జరిపిన దాడుల్లో సామాన్య పౌరులు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌పై దాడులు చేయడం సరైనదని పాక్‌ భావించినప్పుడు.. భారతదేశం తన పొరుగుదేశమైన పాకిస్తాన్‌పై దాడులు చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు.

భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ప్రస్తావిస్తూ రెహ్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మే 7న భారత దళాలు పాకిస్తాన్ భూభాగంలోని బహవల్పూర్, మురిడ్కే, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22న 26 మంది భారతీయులను లష్కరే ఎ తోయిబా ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నందుకు ప్రతీకారంగా భారత్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడులను పాక్ నేత బహిరంగంగా ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
 

కరాచీలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడిన రెహ్మాన్.. పాకిస్తాన్ అనుసరిస్తున్న ద్వంద్వ విధానాన్ని ఎండగట్టారు. ‘భారతదేశం.. పాక్‌లోని బహవల్పూర్, మురిడ్కేలలో ఉగ్రవాద గ్రూపుల ప్రధాన కార్యాలయాలపై దాడి చేసినప్పుడు పాక్‌ ఎందుకు అభ్యంతరాలు లేవనెత్తింది? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్‌పై అలాంటి ఆరోపణలు చేస్తోంది’ అని ఆయన నిలదీశారు. పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ సారధ్యంలో జరుగుతున్న ఈ సరిహద్దు దాడులు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆఫ్ఘనిస్తాన్ పౌరులపై పాకిస్తాన్ జరిపిన దాడులను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తీవ్రంగా ఖండించింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని భారత్ సమర్థిస్తుందని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. 2021లో తాలిబాన్ల పాలన వచ్చినప్పటి నుండి పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో పాక్‌ నేతలు తమ దేశ వైఖరిని తప్పుబడుతున్నారు. ఇది పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఇరకాటంలో పడేసే పరిణామంగా మారింది.

ఇది కూడా చదవండి: భారత్‌ ‘మెగా రోడ్డు’తో డ్రాగన్‌కు చుక్కలే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement