 
													తుర్కీయే(టర్కీ), ఖతార్‌ల మధ్యవర్తిత్వం ఫలించింది. కాల్పుల విరమణకు అఫ్గనిస్తాన్, పాకిస్తాన్‌లు అంగీకరించాయి. దీంతో ఇరు దేశాల సరిహద్దు ఉద్రిక్తతలకు తెర పడింది. ‘శాంతి కోసం ఇంకో అవకాశం..’ అంటూ పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ అసిఫ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇటు తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వం ఖరారు చేస్తూనే.. పాక్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
తాలిబాన్ తాత్కాలిక హోం మంత్రి ఖలీఫా సిరాజుద్దీన్ హక్కానీ పాకిస్తాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. తమ అంతర్గత సమస్యలను ఆఫ్గానిస్తాన్‌పై మోపే ప్రయత్నాలు చేస్తే, తీవ్ర మూల్యం చెల్లించాల్సి వస్తుందని పాక్‌కు ఆయన స్పష్టం చేశారు. ‘‘మీ సమస్య మీదే(తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ TTP సంస్థ కార్యకలాపాల గురించి). పరిష్కారం కూడా మీ వద్దే ఉంటుంది. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు ఇందులో లాగుతున్నారు?..
.. ఒక దేశం తన ప్రయోజనాల కోసం మరో దేశ భూభాగాన్ని ఉల్లంఘించడం అనైతికం. మా సహనాన్ని పరీక్షిస్తే, మా ప్రతిస్పందన చాలా ఘాటుగా ఉంటుంది. ప్రపంచ సామ్రాజ్యవాదులను ఎదుర్కొన్నాం. యుద్ధ భూమిలో అఫ్గన్లు తమ సామర్థ్యాన్ని ఇప్పటికే నిరూపించుకున్నారు. అలాంటిది మళ్లీ పోరాడటంలో మాకు ఇబ్బంది లేదు” అని ఆయన అన్నారాయన.
గత కొన్నివారాలుగా పాక్-అఫ్గన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పాక్ తమ భూభాగంలో దాడులకు తెగబడుతోందని.. పౌరుల ప్రాణాలు తీస్తోందని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించగా, అఫ్గన్ భూభాగంలో తలదాచుకున్న టీటీపీ ఉగ్రవాదుల ఎరివేతే లక్ష్యంగా తాము దాడులు జరుపుతున్నామని పాక్ ప్రకటించుకుంది. ఈ క్రమంలో ఇరు వైపులా దాడులతో భారీగానే ప్రాణ నష్టం సంభవించింది.
ఈ మధ్యలో తాత్కాలిక కాల్పుల విరమణ జరిగినా.. ఉల్లంఘనలు జరిగాయి. దీంతో ఖతార్, టర్కీ జోక్యం చేసుకుని ఇరుదేశాలకు ఓ ఒప్పందానికి తీసుకొచ్చాయి. నవంబర్ 6వ తేదీన ఇస్తాంబుల్ మరోమారు సమావేశమై ఒప్పందానికి తుదిరూపం దిద్దుతామని తుర్కీయే విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. గురువారం ప్రకటన తర్వాత ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి: టీటీపీ ఎలా పుట్టింది?.. ఆ ఒక్కడే పాక్‌ను ఎలా వణికిస్తున్నాడు?

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
