
అది కాబూల్‌లోని ఓ మారుమూల కొండ ప్రాంతం. ఓ టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనం నిదానంగా వెళ్తోంది. ఓ క్షిపణి రయ్‌మంటూ దూసుకొచ్చి ఆ వాహనాన్ని ఢీ కొట్టింది. ‘హమ్మయ్యా..’ అంటూ పాక్ సైన్యం సంబురాలు చేసుకుంది. కట్ చేస్తే.. ఆ మరుసటిరోజే ‘నేను అమరుడ్ని..’ అనే రేంజ్‌లో ఓ వ్యక్తి వాయిస్‌తో ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. అంతే పాక్ సైనికాధికారుల ముఖంలో సంతోషం పోయి.. మళ్లీ తలపట్టుకున్నారు.
పాకిస్తాన్-అఫ్గనిస్తాన్ మధ్య గత 10 రోజులుగా పరస్పర దాడులతో యుద్ధ పరిస్థితులు నెలకొన్నది చూస్తున్నదే!. ఈ దరిమిలా 48 గంటల కాల్పుల విరమణతో పరిస్థితి కాస్త చల్లారినట్లే కనిపిస్తోంది. అయితే.. ఒకప్పుడు జగ్రి దోస్తులుగా ఉన్న ఈ రెండు దేశాలు దుష్మన్‌లుగా మారడానికి కారణం.. ఒకే ఒక్కడు. వాడి పేరు నూర్ వాలి మోహ్సూద్(Noor Wali Mehsud). పాక్‌కు కొరకరాని కొయ్యగా(వ్యక్తిగా) మారిన ఇతని గురించి ఇంటర్నెట్‌లో ఇప్పుడు తెగ వెతికేస్తున్నారు.
నూర్ వాలి మెహ్సూద్(47).. ఒకప్పుడు తాలిబాన్ ఉద్యమంలో భాగమైన వ్యక్తి. అయితే ఆ తర్వాతి కాలంలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) అనే ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తూ.. పాక్‌ను వణికిస్తున్నాడు. ఇతని నేతృత్వంలో టీటీపీ సంస్థ పాక్ గడ్డపై పలు దాడులు జరిపింది. మరీ ముఖ్యంగా సైనిక స్థావరాలు, పోలీసు ఔట్‌పోస్టులను లెక్కలేన్నంటిని నాశనం చేసింది. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతంలో ఇతని నేతృత్వంలో జరిగిన దాడులతో పాక్‌కు తీరని నష్టమే వాటిల్లింది. అలా..
తమ దేశ భద్రతా వ్యవస్థకు నూర్ వాలి మెహ్సూద్ పెనుముప్పుగా మారడంతో పాక్ ప్రభుత్వం శాంతి చర్చలకు ఆహ్వానించింది. అయితే.. నూర్ మొండి పట్టు వల్లే ఆ చర్చలు విఫలం కావడం గమనార్హం. తాజాగా ఇతగాడి చర్యల వల్ల పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.
ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న పాక్ సైన్యం.. అతను ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై క్షిపణి దాడులు చేసింది. అయితే అనూహ్యంగా నూర్ వాలి దాడి నుంచి తప్పించుకున్నాడు. అతని అనుచరులు గాయాలతోనే బయటపడినట్లు తెలుస్తోంది. తన క్షేమసమాచారాన్ని తెలియజేస్తూ ఆ మరుసటిరోజే ఆడియో క్లిప్ ఒకటి నూర్ బయటకు వదిలాడు.
ఈ టీటీపీ ఏంటసలు..
తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) పలు నిషేధిత సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన గ్రూప్. అయితే.. ఇది ఏర్పడడానికి ఒక బలమైన కారణం ఉంది. లాల్ మసీదు ఏరియా.. ఇస్లామాబాద్‌లో ఒకప్పుడు మతపరమైన కేంద్రంగా విరజిల్లేది. మౌలానాలు అబ్దుల్ అజీజ్, అబ్దుల్ రషీద్ ఘాజీ సారథ్యంలో షరియా చట్టం అమలు కోసం ఉద్యమించారు. అయితే.. ఉద్యమం మాటున ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ అప్పటి సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ప్రభుత్వం ఆపరేషన్ సైలెన్స్ పేరిట చర్యకు ఉపక్రమించింది.
జులై 3-11 తేదీ మధ్య ఈ దాడిలో 100 మంది మరణించగా.. 11 మంది సైనికులు, 200 మంది పౌరులు గాయపడ్డారు.మరణించిన వాళ్లంతా మిలిటెంట్లేనని ముషారఫ్ నాడు ప్రకటించారు. లాల్ మసీద్ ఘటన భావోద్వేగంగా, మతపరంగా ప్రజలను ప్రభావితం చేసింది. అయితే.. ఈ ఘటనను ఇస్లాం మీద దాడిగా భావించిన పలు గ్రూపులు.. పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రతీకారంగా కలసి TTPను డిసెంబర్ 2007లో ప్రకటించాయి. దీని లక్ష్యం.. అప్పటి ముష్రాఫ్ ప్రభుత్వాన్ని కూల్చేయడం, పాకిస్తాన్‌లో షరియా చట్టం అమలయ్యేలా చూడడం. కాలక్రమంలో.. ఇది పాక్ సరిహద్దు ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేసుకుని పాక్ భూభాగంపై తరచూ దాడులు చేస్తూ వస్తోంది.
నూర్ సారథ్యం.. మరో మలుపు!
2018లో అఫ్గన్ సరిహద్దులో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో టీటీపీ కీలక నేతలు ముగ్గురూ మరణించారు. దీంతో నూర్ వాలి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. నూర్ వాలి మెహ్సూద్ సారథ్యంలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) కొత్త పంథా ఎంచుకుంది. టీటీపీ అంటే అప్పటిదాకా పాక్ అమాయక పౌరులను బలిగొన్న కరుడుగట్టిన ఉగ్రసంస్థగా ముద్రపడిపోయింది. 2014లో ఓ పాఠశాలలో జరిపిన దాడిలో 130 మంది చిన్నారులు మరణించడం.. ఇందుకు ఓ ఉదాహరణ కూడా.
అయితే మత పండితుడైన నూర్.. తన సారధ్యంలో అలాంటివి జరగకూడదని బలంగా తీర్మానించాడు. పాక్ సైన్యం అనేది ఇస్లాంకు వ్యతిరేకంగా.. 78 ఏళ్లుగా పాక్ ప్రజలను బందీఖానాలో ఉంచిందని, రాజకీయ జోక్యంతో భ్రష్టు పట్టిపోయిందని ఘాటు విమర్శలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పౌరుల జోలికి పోకూడదని.. కేవలం పాక్ ఆర్మీ, అవసరమైతేనే పోలీసులను లక్ష్యంగా చేసుకోవాలని టీటీపీ కేడర్‌కు సూచించాడు. అలా టీటీపీపై పడ్డ మచ్చను చెరిపేసే ప్రయత్నం చేశాడు నూర్.
2021లో అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్ అధికారంలోకి రావడంతో.. TTPకు ఆఫ్ఘన్ సరిహద్దుల్లో స్వేచ్ఛగా సంచరించే అవకాశం కలిగింది. ప్రత్యేకించి.. పాక్ ఉత్తర పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు పెరిగాయి. పాక్ చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే.. నూర్ వాలి ఆఫ్ఘనిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్నాడని, తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వ సహకారంతోనే మరింత రెచ్చిపోతున్నాడని. అంతేకాదు..
తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఇస్లాం మతాన్ని వక్రీకరిస్తోందని, అలాంటి సంస్థకు భారతదేశమూ మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ వచ్చింది. అయితే, ఈ ఆరోపణలను న్యూఢిల్లీ ఖండించింది, తాము ఎలాంటి మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేసింది.