
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఇటీవలే హారర్ కామెడీ థ్రిల్లర్ థామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇకపోతే ఈ మధ్యే తెలుగు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో రష్మిక ఎంగేజ్‌మెంట్ జరిగింది. దీనికంటే ముందు రష్మికకు లవ్ బ్రేకప్ అనుభవం ఉన్న విషయం తెలిసిందే. గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టి (Rakshit Shetty)తో ప్రేమాయణం సాగించి నిశ్చితార్థం కూడా జరుపుకుంది. పెళ్లి బంధంతో ఒక్కటవుతారనుకుంటే.. బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.
మగవారిలా గడ్డం పెంచలేం
ఇటీవల ఓ భేటీలో రష్మిక.. ప్రేమ, బ్రేకప్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రేమ, బ్రేకప్‌లో విషయంలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా బాధపడతారనే మాటను అంగీకరించనంది. బ్రేకప్ వల్ల మహిళలే ఎక్కువ బాధ, వేదనకు గురవుతున్నారని పేర్కొంది. తమ బాధను వ్యక్తం చేయడానికి మగవారిలా గడ్డం పెంచడం, మద్యం తాగడం వంటివి చేయలేమంది. మనసులోనే బాధను భరిస్తుంటామని, బయటకు వ్యక్తం చేయలేమని తెలిపింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా రష్మిక మందన్నా ఉమెన్ సెంట్రిక్ పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది.