
“ప్రభాస్ పేరు కాదు, బ్రాండ్.” ఎందుకంటే ఆయన సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా సరే వందల కోట్ల కలెక్షన్స్ వసూలు చేయడం సాధారణం. ఇది ప్రభాస్ పవర్ ఏంటో సూచిస్తుంది. అత్యధిక బడ్జెట్ సినిమాలు, బాక్సాఫీస్ రికార్డులు, అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవన్నీ ప్రభాస్ సినీ ప్రయాణంలో సాధారణ విషయాలే. కానీ, ఆయన వ్యక్తిత్వం మాత్రం అసాధారణం. మీడియాకు దూరంగా ఉంటూనే తన పనితోనే మాట్లాడే బాహుబలి.. సినిమా ఏదైనా సరే ప్రతి పాత్రలో తన శ్రమను, నిబద్ధతను చూపిస్తారు.
తెలుగు సినిమా చరిత్రలో ప్రభాస్ ఒక విప్లవాత్మక అధ్యాయం. ఆయన మాటలు తక్కువ, కానీ ప్రభావం ఎక్కువ. బాహుబలి రూపంలో భారతీయ సినిమాకు ఒక కొత్త దిశను చూపించారు. ప్రభాస్ అంటే కేవలం నటుడు కాదు – ఒక భావన, ఒక స్ఫూర్తి, ఒక క్రేజ్. ఆయన సినిమాలు విడుదలయ్యే రోజు, అభిమానులకు పండుగ. ఆయన పుట్టినరోజు అంటే సేవా కార్యక్రమాలు, సోషల్ మీడియా సందడి కనిపించడం సహజం. నేడు ప్రభాస్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
ఛత్రపతితో మొదలు
ప్రముఖ నటులు దివంగత కృష్ణంరాజు వారసుడిగా 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశారు. ఈ సినిమా నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో తొలి సినిమా. ఈ సినిమా విజయం సాధించినా ఆ తర్వాత 2003లో విడుదలైన 'రాఘవేంద్ర' సినిమా పరాజయం పాలైంది. 2004లో త్రిష సరసన నటించిన 'వర్షం' సినిమా ప్రభాస్ మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ అడవి రాముడు, చక్రం సినిమాల్లో నటించాడు. ఈ సినిమాల ద్వారా ప్రభాస్‌కు నటుడిగా పేరు లభించినా పరాజయం పాలయ్యాయి. 2005లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్- శ్రియా కాంబోలో 'ఛత్రపతి' వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాతో ప్రభాస్‌కు ఎక్కడలేని ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసింది. దీంతో తెలుగు పరిశ్రమలో టాప్ హీరోల లిస్ట్‌లో ప్రభాస్ చేరిపోయాడు.

ప్రభాస్.. రూ. 7 వేల కోట్లు
సలార్, కల్కి తర్వాత ప్రభాస్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ మధ్య దూరం ఎక్కువగా ఉండేది. మన సినిమాలంటే హిందీ బెల్ట్‌లో చిన్నచూపు. కానీ, ప్రభాస్ రాకతో తెలుగు సినిమాకు గౌరవం తీసుకొచ్చాడు. అతను వేసిన దారిలోనే నేడు మన చిత్రాలన్నీ హిందీలో మెప్పిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్‌తో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టనున్నారు. ఈ క్రమంలో బాహుబలి: ది ఎపిక్ పేరుతో తన ఫ్రాంఛైజీ చిత్రాన్ని ఒకే భాగంగా ఈ నెల 31న విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత రాజాసాబ్, దర్శకుడు హను రాఘవపూడితో మరో చిత్రం లైన్‌లో ఉంది. స్పిరిట్, కల్కి-2, సలార్-2 వంటి సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి.
ఇక మీద ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్రభాస్ ΄ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఇలా ఒకేసారి రెండు మూడు చిత్రాల్లో నటిస్తూ, లైనప్‌లో మరో రెండు మూడు సినిమాలు ఖరారు చేసి, బిజీ బిజీగా ఉంటున్నారు ప్రభాస్. ఇలా ప్రభాస్ నటిస్తున్న 5 సినిమాలు కూడా ఈ రెండు ఏళ్లలోనే విడుదల కావచ్చు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఆయన ఐదు చిత్రాలకు సంబంధించి ఏకంగా రూ. 7వేల కోట్లు పైగానే మార్కెట్ చేయవచ్చని ఒక అంచనా ఉంది. ఈ లెక్కలు తలుచుకుంటేనే వామ్మో అనిపిస్తోంది కదా.. అయినా ఇదే నిజం.

ప్రభాస్ లైఫ్‌లో ఇవన్నీ ఎంతో ప్రత్యేకం
► ప్రముఖ మ్యూజియం మేడమ్ టుసాడ్స్‌లో మైనపు విగ్రహం కలిగిన మొదటి దక్షిణాది స్టార్‌గా ప్రభాస్ గుర్తింపు పొందారు.
► కేవలం 'బాహుబలి' ప్రాజెక్టు కోసం ఐదేళ్లు కేటాయించడం
► ప్రభాస్ 2014లోనే తొలిసారి హిందీ సినిమాలో మెరిశారు. అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా కలిసి నటించిన 'యాక్షన్ జాక్సన్'లో అతిథిగా కనిపించారు.
► కల్కి సినిమా ఆరు రోజుల్లో రూ. 700 కోట్ల వసూలుతో 2024లో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.
► రష్యన్ ఆడియన్స్ హార్ట్ అవార్డు పొందిన రెండవ భారతీయ నటుడిగా ప్రభాస్ నిలిచారు, ఇది ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది
► COVID-19 సమయంలో CM రిలీఫ్ ఫండ్‌కు రూ. 4 కోట్లు విరాళంగా ప్రభాస్ ఇచ్చారు. ఇది తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక విరాళంగా గుర్తించబడింది.
► స్టార్‌డమ్ సొంతం చేసుకుని ఎన్నో ఏళ్లయినా ప్రభాస్ ప్రకటనలకు కాస్త దూరంగా ఉన్నారు. 2015లో తొలిసారి ఓ కారు ప్రచారంలో భాగంగా వాణిజ్య ప్రకటనలో నటించారు.
► రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి నటుడిగా రికార్డుకెక్కాడు. ప్రభాస్ ఆదిపురుష్ కోసం రూ. 100 నుంచి 120 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.
► బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది.
► మిర్చి సినిమాకు ఉత్తమనటుడిగా 2013లో నంది అవార్డు దక్కించుకున్న ప్రభాస్
► తన 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకొని తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ కు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
► ప్రభాస్ నటుడు కాకపోయుంటే..? హోటల్ రంగంలో స్థిరపడేవారు.
► ప్రభాస్‌కు ఏపీలో శ్రీశైలం అంటే ఎంతో ఇష్టం
► ఇష్టమైన పాట: 'వర్షం'లోని 'మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం'.
► నటులు: షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, రాబర్ట్ డి నిరో, జయసుధ, శ్రియ, త్రిషలకు ప్రభాస్ అభిమాని.