
పాములు పట్టేవాడు పాముకాటుకే బలైనట్లు దొంగతనాలు చేసే సంజనానే దొంగదెబ్బ తీశారు సుమన్, తనూజ. బిగ్‌బాస్ ఇంటిని వాంటెడ్ పేట అని దొంగలనివాసంగా మార్చేశారు. బిగ్‌బాసే చెప్పాక కంటెస్టెంట్లు ఆగుతారా? ఏముంది, దొరికిన డబ్బు దోచేసుకున్నారు. కానీ, ఒక్క చోరీకే రుసరుసలాడింది సంజన.. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 22వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
మాస్ మాధురి Vs సంజన సైలెన్సర్
బిగ్‌బాస్ హౌస్ గ్యాంగ్‌స్టర్ అడ్డాగా మారింది. మాస్ మాధురి, సంజన సైలెన్సర్ గ్యాంగుల మధ్య పోటీ జరుగుతోంది. సంజన (Sanjana Galrani) డబ్బులు పోవడంతో అందరిపైనా గరమైంది. హౌస్‌మేట్స్ అసలే గజదొంగల వేషాల్లో ఉన్నారు. అయ్యోపాపం.. అని డబ్బు తిరిగిస్తారా? ఛాన్సే లేదు. అవతలి టీమ్‌లో ఉన్న తనూజ, సుమన్‌లు ఆ డబ్బు ఎప్పుడో పంచేసుకున్నారు. కానీ అది జీర్ణించుకోలేని సంజనా.. లాక్కోవడం గీక్కోవడం మన క్లాస్ కాదు. బయట ఆర్టిస్టులం.. అంటూ సంబంధం లేని డైలాగులు వల్లె వేసింది.

అమ్ముకోమంటే పూటుగా లాగించేశారు
దాన్ని దివ్య మోసుకెళ్లి మాధురి (Divvala Madhuri) చెవిలో పడేసింది. అందుకామె ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకోమని చెప్పు అని సంజనాపై అసహనం వ్యక్తం చేసింది. తర్వాత రెండు గ్యాంగ్ లీడర్లకు కాఫీ షాప్, పానీపూర్ స్టాల్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీని ద్వారా డబ్బు సంపాదించుకోమన్నాడు. కానీ, అమ్మడంపై ఫోకస్ పెట్టడం మానేసి.. తేరగా వచ్చిందని తినడంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారంతా! దీంతో బిగ్‌బాస్ ఆ స్టాల్ టాస్క్ ఎత్తేశాడు.

గెలిచిన మాధురికి జేజేలు
తర్వాత ధమాకా కిక్.. కాళ్లలో దమ్ము ఉండటం అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో కాలును ఉపయోగించి చెప్పును గోడపై వీలైనంత ఎక్కువ ఎత్తులో అతికించాలి. ఇందులో అందరికంటే రీతూ చౌదరి బాగా ఆడింది. ఈ గేమ్‌లో మాధురి టీమ్ గెలవడంతో ఓడిపోయిన సంజనా టీమ్ మెంబర్స్ ఆమెను ఎత్తుకుని జై కొడుతూ ఇల్లంతా ఊరేగించారు.