
ప్రేక్షకుల హృదయాల్లో డార్లింగ్‌గా తనకంటూ ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం సొంతం చేసుకున్నారు హీరో ప్రభాస్. ‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించిన ఆయన ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా దూసుకెళుతున్నారు. నేడు (అక్టోబరు 23) ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న, నటించనున్న సినిమాల అప్‌డేట్స్‌ని షేర్ చేసింది ప్రభాస్ టీమ్.
ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒకే భాగంగా ఈ నెల 31న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాపై మూవీ లవర్స్, ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కానుంది. రొమాంటిక్ హారర్ కామెడీగా రూ పొందుతోన్న ఈ మూవీలో వింటేజ్ లుక్‌లో ఆడియన్స్‌ని అలరించనున్నారు ప్రభాస్.
అదే విధంగా ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ ప్రీ లుక్ పోస్టర్‌ని బుధవారం రిలీజ్ చేశారు. టైటిల్ పోస్టర్‌ని నేడు విడుదల చేయనున్నారు. అలానే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న చిత్రం ‘స్పిరిట్’.
ప్రభాస్ తొలిసారి పోలీసాఫీసర్‌గా కనిపించనున్న చిత్రం ఇది. ఇక ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్ 2’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2’ వంటి సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి. ఇక మీద ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్రభాస్ ΄ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఇలా ఒకేసారి రెండు మూడు చిత్రాల్లో నటిస్తూ, లైనప్‌లో మరో రెండు మూడు సినిమాలు ఖరారు చేసి, బిజీ బిజీగా ఉంటున్నారు ప్రభాస్.