
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ముఖ్యంగా తెలుగువారికి ఏడు కొండలు అనగానే తిరుమల, తిరుపతి గుర్తొస్తాయి. కలియుగ దైవం వెంకటేశ్వరుడిని ఏడు కొండలవాడా అంటూ మనసారా స్మరించుకోకుండా కోట్లాది భక్తులకు రోజు గడవదు. అయితే ఏడుకొండల నగరంగా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మరొక నగరం కూడా ఉంది. అలా సెవన్ హిల్స్ సిటీగా("City of Seven Hills") ప్రసిద్ధి చెందిన ఆ నగరం ఇటలీ(Italy) రాజధాని రోమ్(Rome)లో ఉంది.
ఏడు వేర్వేరు ఎత్తులలో లేదా దాని చుట్టూ నిర్మించిన నగరాలను వివరించడానికి ప్రపంచవ్యాప్తంగా సెవెన్ హిల్స్ నగరం అనే పదాన్ని ఉపయోగిస్తారు. అలా అత్యంత ప్రసిద్ధమైన వాటిలో ఒకటి రోమ్, ఈ పురాతన పట్టణం అవెంటైన్, కైలియన్, కాపిటోలిన్, ఎస్క్విలిన్, పాలటైన్, క్విరినల్ విమినల్ అనే ఏడు కొండలపై నిర్మితమై ఆ పేరుకు ప్రసిద్ధి చెందింది. ఈ కొండల భౌగోళిక లక్షణం అది మాత్రమే కాదు, అవి రోమన్ నాగరికతకు జన్మస్థలం కూడా.
ఇవి అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాలలో ఒకదానికి పునాదిగా మారాయి. ఇందులో ప్రతి కొండకు ఒక ప్రత్యేకమైన కథ ఉండడం విశేషం, ఇది రోమ్ గుర్తింపును రూపొందించిన ఇతిహాసాలు, దేవాలయాలు రాజభవనాలతో నిండి ఉంది. ఇవి రోమ్ పురాణాలకు, వారి సంస్కృతికి రాజకీయ కార్యకలాపాలకు కూడా మూలం. పాశ్చాత్య నాగరికతను ప్రభావితం చేసే దీని ప్రకృతి దృశ్యాలు, రోమ్ నగర స్థాపకులైన రోములస్ రెముస్ ల కధలకు దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి.
పేరు వెనుక చరిత్ర
రోమ్ నగర ప్రారంభం క్రీ.పూ 753 నాటిది. కవల సోదరులు రోములస్ రెమస్ కొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. రోములస్ పాలటైన్ కొండను ఆదర్శవంతమైన ప్రదేశంగా ఎంచుకుని రోమ్‌గా మారేలా దాని నిర్మాణాన్ని ప్రారంభించాడు. కాలక్రమేణా, కాపిటోలిన్ అవెంటైన్ వంటి సమీపంలోని కొండల ప్రజలు కలిసి, ఒకే బలమైన విశాలమైన నగరాన్ని సృష్టించారు. ఈ ఏడు కొండలు మొదట అడవులు నదులతో చుట్టుముట్టబడిన ప్రత్యేక గ్రామాలు.
జనాభా పెరిగేకొద్దీ, గ్రామాలు విలీనం అయ్యి ఒకే నగరంగా మారాయి. ఇది వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతన ప్రపంచాన్ని పాలించిన నాగరికత అయిన రోమన్ సామ్రాజ్యానికి కేంద్రంగా మారింది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన నగరంగా నిలుస్తోంది రోమ్.. ప్రతి సంవత్సరం 10 మిలియన్లకు పైగా సందర్శకులు ఈ ఏడు కొండలను సమీపంలోని చారిత్రక విశేషాలను ఆసక్తిగా అన్వేషిస్తారు.
(చదవండి: The Chai Story: పాలు కలిపిన టీ తాగే అలవాటు.. ఇలా మొదలైంది...)