దక్షిణాది అందాల ప్రపంచంలో ఆమెది చిరపరిచితమైన పేరు. మిసెస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి తెలుగు మహిళ అనే ఘనత దగ్గర నుంచి ఆ తర్వాత ఆమె మరెన్నో ఘనతల్ని స్వంతం చేసుకుంటూ సినిమా సెలబ్రిటీలకు తీసిపోని పాప్యులారిటీని దక్కించుకుంది. ఆమే తెలంగాణకు చెందిన హైదరాబాద్ వాసి శిల్పారెడ్డి. సినిమా రంగంలోని కుటుంబాలతో దగ్గర సంబంధం, బంధుత్వాలు కూడా శిల్ప(Shilpa Reddy) కుటుంబానికి ఉన్నాయి. ఆమె సోదరుడు కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు.
ముఖ్యంగా అక్కినేని నాగార్జున కుటుంబంతో శిల్పారెడ్డికి దగ్గర బంధుత్వం ఉంది. నాగార్జున మేనల్లుడు సుమంత్ మాజీ భార్య కీర్తిరెడ్డి కూడా శిల్పారెడ్డి కి బంధువే. గతంలో నాగార్జున తో శిల్పారెడ్డి, ఆమె భర్త వ్యాపార భాగస్వాములుగా కూడా ఉన్నారు. బంజారాహిల్స్‌లో టచ్ పబ్ పేరిట ఒక అత్యంత అధునాతన రెస్టారెంట్‌ను వీరు భాగస్వాములుగా కొంత కాలం పాటు నిర్వహించారు కూడా.

ఈ నేపధ్యంలోనే నాగచైతన్యకు కొంత కాలం పాటు ప్రియురాలిగా, ఆ తర్వాత భార్యగా ఉన్న సమంత(Samantha ) కూడా శిల్పారెడ్డికి క్లోజ్ ఫ్రెండ్‌గా మారింది. మోడలింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనర్‌గా మారిన శిల్ప డిజైన్లను సమంత బాగా ఇష్టపడేది. అలాగే ఫిట్‌నెస్ నిపుణురాలిగానూ ఆమెకు శిల్ప చాలా రకాలుగా సలహాలు సూచనలు అందించేది. వీరిద్దరి స్నేహం నాగచైతన్యతో విడాకుల తర్వాత కూడా అంతే గాఢంగా ఇంకా చెప్పాలంటే మరింత సన్నిహితంగా కొనసాగడం విశేషం.
ఇప్పటికీ సమంత కి సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సింగర్ చిన్మయి, శిల్పా రెడ్డి లే అని చెబుతారు. ఫ్యాషన్ నుంచి రిలేషన్స్ దాకా ఎన్నో జీవిత పాఠాలను శిల్పా నేర్పింది అని అంటుంటారు. జీవితంలో వచ్చిన కష్టాలు, సంతోషాలు అన్నింటిలో శిల్ప చేదోడు వాదోడుగా నిలిచింది. విడాకుల తరువాత విపరీతమైన ఒంటరితనాన్ని అనుభవించి అనారోగ్యానికి కూడా గురైన సమంత కోలుకోవడానికి అండదండలు అందించిన వారిలో శిల్ప మొదటి స్థానంలో ఉటుంది. అలా బెస్ట్ ఫ్రెండ్స్ అనే పదానికి వీరిద్దరూ బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు.

సమంత తన జీవితంలో తీసుకునే కీలక నిర్ణయాలు అన్నింటిలోనూ శిల్పారెడ్డి పాత్ర ఉంటుందని సన్నిహితులు చెబుతారు. ఇక రాజ్ నిడిమోరుతో ప్రేమ, పెళ్లి విషయంలో కూడా శిల్ప తన వంతు సలహాలు అందించినట్టు సమాచారం. రాజ్, సమంతల పెళ్లి వేడుకలో శిల్ప సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది. సమంత పెళ్లి ఫోటోలను శిల్ప సైతం అభిమానులతో షేర్ చేసుకుంది. శిల్పా తన జీవితంలోకి వచ్చాక ఎంత మార్పు వచ్చిందో సమంత మాటల్లోనే చెప్పాలంటే... ’శిల్పా రెడ్డి నువ్వు నా జీవితాన్ని ఎన్ని రకాలుగా మార్చావో అది నీకు కూడా తెలియదు. , నువ్వు నన్ను ధ్యానంలోకి నెట్టిన ఆ 15 నిమిషాలు నా జీవిత గమనాన్ని నిజంగా మార్చాయి. అలాంటి గొప్ప బహుమతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ సమంత తన కృతజ్ఞతన వ్యక్తం చేసింది.
ఏదేమైనా..అవసరాలే ప్రాతిపదికగా వర్ధిల్లే స్నేహాలకు చిరునామా లాంటి సినీ రంగంలో ఇలాంటి అపురూప స్నేహాలు అప్పుడప్పుడయినా తారసపడుతుండడం స్నేహపిపాసులకు కొంతయినా ఉపశమనమే అనాలి.


