‘పుష్ప2’ సినిమా ప్రీమియర్స్ నాడు జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ గురించి తాజాగా నిర్మాత బన్ని వాస్ మాట్లాడారు. ప్రస్తుతం అతని కుటుంబానికి అందుతున్న సాయం గురించి ఆయన చెప్పుకొచ్చారు. 'ఈషా' సినిమా గ్లింప్స్ విడుదల సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.
శ్రీతేజ్‌కు అందుతున్న సాయం గురించి బన్నివాస్‌ను మీడియా ప్రశ్నించగా ఆయన ఇలా చెప్పారు. బాబు శ్రీతేజ్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. దిల్రాజు వంటి ఇతర పెద్దలు పర్యవేక్షిస్తున్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం కోసం ఇచ్చిన డబ్బు ఎక్కడ ఉంచాలి..? ఆస్పత్రి ఖర్చుల కోసం ఎంత ఉపయోగించాలి..? వారి కుటుంబం నెలవారీ ఖర్చులకు ఎంత అవసరం వంటి వాటిపై వ్యవస్థీకృతంగా ఒక విధానం నడుస్తోంది. బాబు కోసం ఇచ్చిన డబ్బు సరిపోకపోవడం వంటి అంశపై ఏమైనా మాట్లాడాలంటే వాళ్లు వచ్చి మాతో మాట్లాడవచ్చు. మావైపు నుంచి ఏవైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటాం. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. శ్రీతేజ్ విషయం చర్చించడానికి మధ్యలో పెద్దలు ఉన్నారు. వారి సమక్షంలోనే మంచి చేస్తాం. అని అన్నారు.


