సినిమా చూసేందుకు థియేటర్స్‌కి రండి అంటూ ప్రేక్షకులను వేడుకుంటున్న ఈ రోజుల్లో.. నిర్మాత బన్నీ వాసు మాత్రం మా సినిమా చూసి ఇబ్బంది పడొద్దని కొంతమందికి విజ్ఞప్తి చేస్తున్నాడు. అంతేకాదు థియేటర్స్‌కి వచ్చిన తర్వాత ఏమైనా జరిగితే మా బాధ్యత కూడా కాదని ముందే చెబుతున్నాడు. అయితే ఈ హెచ్చరిక హార్ట్ వీక్ ఉన్నవాళ్లకి మాత్రమే అంటున్నాడు బన్నీవాసు.
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి వరుస హిట్లతో దూసుకెళ్తున్న బన్నీ వాసు(Bunny Vasu)..త్వరలోనే ‘ఈషా’ అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీనివాస మన్నే దర్శకత్వంలో పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ రోజు ఈ మూవీ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బన్నీవాసు మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో ఇలాంటి హారర్ మూవీ రాలేదని.. థియేటర్స్‌కి వచ్చిన ప్రేక్షకులు కచ్చితంగా భయపడడం ఖాయమన్నారు.
(చదవండి: భయపెట్టించే మరో హారర్.. గ్లింప్స్‌తోనే వణికించిన ‘ఈషా’)
‘దెయ్యాలు, ఆత్మలు అంటే నేను భయపడను. ఎక్కడైన హంటింగ్ ప్లేస్ ఉందంటే ప్రత్యేకంగా వెళ్లి చూసొస్తాను. ఈషా సినిమా గురించి చెప్పినప్పుడు రొటీన్‌గానే ఉంటుందని కూర్చున్నాను. హారర్ సినిమాను ఎలా తెరకెక్కిస్తారనేది మాకు తెలుసు కాబట్టి.. సినిమా చూసినప్పుడు భయం కలగలదు. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను నాలుగు సార్లు భయపడ్డాను. దెయ్యం మేకప్ ఎలా వేస్తారో, షూటింగ్ ఎలా చేస్తారో..ఇలా అన్ని తెలిసిన నేను కూడా భయపడ్డాను. తెలిసి కూడా భయపడే సినిమా ఇది.
ఎడిటింగ్ మీద, సౌండింగ్ మీద ఎంతో గ్రిప్ ఉంటేనే ఇలాంటి సినిమా వస్తుంది. దర్శకుడు శ్రీనివాస్ చాలా అద్బుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. చివరి 15 నిమిషాలు అయితే అద్భుతంగా ఉంటుంది. డిసెంబర్ 12న థియేటర్స్‌కి రండి భయపడి ఎంజాయ్ చేయండి. కొంచెం హార్ట్ వీక్ ఉన్నవాళ్లు మాత్ర దయచేసి ఈ సినిమాను చూడకండి. థియేటర్స్‌కి వచ్చిన తర్వాత ఏమైన అయితే మమ్మల్ని అడగొద్దు. ముందే చెబుతున్నా..హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈ సినిమా చూస్తే ఇబ్బంది పడతారు’ అని బన్నీ వాసు చెప్పారు.


