దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్ (85) ఇక లేరు. వయో భారం.. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళంలో చిత్రాలు నిర్మించారాయన. ఎంజీఆర్, శివాజీ, జెమిని గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి లెజెండరీలు.. విక్రమ్, రానాలాంటి తారలు ఈ ప్రతిష్టాత్మక బ్యానర్‌లో నటించారు.
ఏవీఎం అంటే అర్థం.. ఏవీ మేయప్పన్. ఆయన శరవణన్ తండ్రి. మద్రాస్(నేటి చెన్నై) కేంద్రంగా ఈ బ్యానర్ తొలినాళ్లలో సరస్వతి సౌండ్ ప్రొడక్షన్స్‌గా..ఆ తర్వాత ప్రగతి పిక్చర్స్ లిమిటెడ్, ప్రగతి స్టూడియోస్.. మేయప్పన్( ఏవీ మేయ్యప్ప చెట్టియార్) తన భాగస్వాములతో కలిసి నడిపించారు. 1945లో AVM Productionsగా మారింది. అప్పటి నుంచి ఈ బ్యానర్‌లో ఎన్నో గొప్ప చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. తండ్రి ఏవీ మేయప్పన్ తర్వాత శరవణన్ ఆ ప్రొడక్షన్ హౌజ్‌ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు.
వివిధ భాషల్లో 176 సినిమాలతో పాటు తెలుగు, తమిళ్, మలయాళంలో సీరియల్స్‌ను ఏవీఎం బ్యానర్‌లో నిర్మించారు. భూకైలాస్(1940), శివాజీ ది బాస్, మెరుపుకలలు, జెమినీ, లీడర్, సంసారం ఒక చదరంగం.. ఇలా ఎన్నో మరుపురాని హిట్స్ అందించారు. ఏవీఎం బ్యానర్‌లో వచ్చిన చివరి చిత్రం ఇదువుమ్ కదాందు పొగుమ్(2014). 2022లో అరుణ్ విజయ్ లీడ్ రోల్‌లో తమిళ్‌రాకర్స్ అనే వెబ్‌సిరీస్ కూడా నిర్మించారు. ఈయన కుమారుడు ఎమ్‌ఎస్ గుహాన్ కూడా నిర్మాతగా రాణిస్తున్నారు. శరవణన్ మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరగనున్నాయి.


