టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టాడని, అక్కడ వరుసగా ఆరు సినిమాలు నిర్మించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడో వచ్చిన పాత ఊహాగానాలకు, ఇప్పటి విషయాలకు ముడిపెడుతూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వాటిని నమ్మొద్దని దిల్ రాజు(Dil Raju) కోరారు.
‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి రాబోయే సినిమాల గురించి ఈ మధ్య రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో నిజం లేదు. ప్రస్తుతం మేము అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రాథమిక పనులు జరుగుతున్నాయి.
త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మేమే అధికారికంగా ప్రకటిస్తాం. అప్పటివరకూ ఈ రూమర్స్‌ను నమ్మొద్దు. అవాస్తవాలను ప్రచారం చేయొద్దని మీడియాను కోరుతున్నాను’ అని దిల్ రాజు విజ్ఞప్తి చేశారు. కాగా, అక్షయ్ కుమార్‌తో దిల్ రాజు నిర్మించే సినిమా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ అని ప్రచారం జరుగుతుంది.


