సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమపై గతేడాది డ్రగ్స్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో హేమ జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ఇటీవల కర్ణాటక హైకోర్టు ఆ కేసును పూర్తిగా కొట్టివేసింది. అయితే తనపై కేసు నమోదైనప్పుడు మీడియాలో చాలా వార్తలు వచ్చాయని.. అదే కేసును కొట్టివేసినప్పుడు మాత్రం తక్కువమంది మాత్రమే రాశారని హేమ అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ ఈ కేసుపై స్పందిస్తూ.. డ్రగ్స్ తీసుకున్నట్లు తనపై ఆరోపణలు చేయడం ఎంతగానో బాధించిందన్నారు.
‘నేను డ్రగ్స్ తీసుకున్నానని చెప్పడం వందశాతం అబద్దం. కానీ బర్త్‌డే పార్టీకి వెళ్లింది నిజం. నా తమ్ముడి లాంటి వ్యక్తి పుట్టినరోజు పార్టీకి పిలిస్తే వెళ్లాను. అక్కడ నేను డ్రగ్స్ తీసుకోలేదు. ఆ పార్టీకి అందరూ ఫ్యామిలీతో వచ్చారు. అది రేవ్ పార్టీ కాదు.. వందశాతం బర్త్‌డే పార్టీనే. నేను పార్టీ నుంచి వచ్చిన తర్వాత అక్కడ డ్రగ్స్ దొరికింది.
కానీ మీడియా మొత్తం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన హేమ రాసేసింది. ఇది చూసి నాకు తెలిసివాళ్లంతా ఫోన్ చేసి ఆరా తీశారు. ఆ సమయంలో నాకు రోజుకు 500 పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. అందరికి సమాధానం చెప్పాను. ఇక ఫోన్ కాల్స్ వల్ల వచ్చే తలనొప్పి భరించలేక.. ఓ వీడియో తీసి పెట్టాను. దాన్ని కూడా కొంతమంది తప్పుగా ప్రచారం చేశారు’ అని హేమ ఆవేదన వ్యక్తం చేసింది.


