దివంగత నటి దేవిక మాజీ భర్త, దర్శకుడు దేవదాస్ (88) కన్నుమూశారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం (నవంబర్ 30) రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఈయన తర్వాతి కాలంలో మాత్రం కనిపించకుండా పోయారు. చాలాకాలంగా ఒంటరిగానే బతుకీడుస్తూ వచ్చారు. ఆయన వ్యక్తిగత జీవితంపై ఈ ప్రత్యేక కథనం..
పెళ్లి చేసుకోమని బలవంతం
సినీ నిర్మాత ఎస్‌ఎంఎస్ సుందరరామన్ కుమారుల్లో దేవదాస్ ఒకరు. సినిమాలపై ఆసక్తితో దివంగత ప్రఖ్యాత దర్శకుడు భీంసింగ్ వద్ద పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ పలు చిత్రాలు నేరుగా డైరెక్ట్ చేశారు. దేవదాస్.. వేగుళి పెన్, మని కోయ కురుప్, రాఖీ వంటి సినిమాలు తెరకెక్కించారు. వేగుళి పెన్ మూవీ సమయంలో హీరోయిన్ దేవిక ఆయనతో ప్రేమలో పడింది.

దేవిక, దేవదాస్
పెళ్లితో జీవితం తలకిందులు
అయితే దేవికయే తన వెంటపడిందని, పెళ్లి చేసుకోమని కాళ్ల మీద పడి బతిమాలిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మనిద్దరికీ సెట్టవదని దేవదాసు చెప్పినా ఆమె వినిపించుకోలేదట! పెళ్లికి ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది! దీంతో ఆమె మాటకు తలొగ్గాల్సి వచ్చింది. అలా ఇద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. వీరికి కనక అనే కూతురు జన్మించింది. కనక.. తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్యనాయుడుకు ముని మనవరాలవుతుంది. కానీ కేవలం డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుందని దేవదాస్‌కు నెమ్మదిగా అర్థమైంది. ఆయన్ను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూసింది.
దశాబ్దాల తరబడి కోర్టులో
అందుకు ఆయన ఒప్పుకోకపోయేసరికి ఒకరోజు తాళి బొట్టు ఆయన మొహాన విసిరికొట్టింది. అంతేకాదు, భర్తను చంపించాలని ప్రయత్నించిందట. ఈ విషయంపై దేవదాస్ పోలీసులను ఆశ్రయించగా దాదాపు 32 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగారు. పెళ్లయిన మూడేళ్లకే దంపతులిద్దరూ విడిపోయారు. కోర్టు కూతురును తల్లికే అప్పగిస్తుంది. అలా కనక తండ్రికి దూరమైంది.
కూతురి కోసం ఇంటికెళ్తే...
కాదు, దేవికయే కూతుర్ని తనకు దూరం చేసిందంటారు దేవదాస్.. ఆమె వేసిన నిందలకు అందరూ తనను శత్రువులా చూశారని బాధపడ్డారు. కనక మానసిక స్థితి సరిగా ఉండదని, ఒకరోజు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు వార్త వస్తే ఇంటికి వెళ్లి చూశారు. కనక బతికే ఉండటంతో అది తప్పుడు వార్త అని క్లారిటీ ఇచ్చారు. కనక ఇంటి బయట అంతా శుభ్రం చేశారు. అయినా తండ్రిని ఆమె లోనికి రానివ్వలేదు.
చారిటీకి ఆస్తి
అలా భార్య, కూతురి ప్రవర్తన వల్ల జీవితాంతం నరకం అనుభవించారు దేవదాసు. దేవికను పెళ్లి చేసుకోవడమే తాను జీవితంలో చేసిన పెద్ద తప్పు అని పశ్చాత్తాపపడ్డారు. తన గురించి పట్టించుకోనివారి కోసం ఆలోచించి సమయం వృథా చేయాలనుకోలేదు. అందుకే తన మరణానంతరం రూ.100 కోట్ల ఆస్తి ట్రస్టుకు చెందాలని వీలునామా రాశారు. ఇప్పుడిక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దేవిక తెలుగులో పెండ్లి పిలుపు, అన్నా చెల్లెలు, గాలిమేడలు, రక్త సంబంధం, మంగళసూత్రం, నిండు మనసులు, గండికోట రహస్యం, పాపం పసివాడు, శ్రృ కృష్ణాంజనేయ యుద్ధం, నిప్పులాంటి మనిషి, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించింది.
చదవండి: సాయిపల్లవి వల్ల నా జీవితమే మారిపోయింది: మ్యూజిక్ డైరెక్టర్


