చిత్రపురి కాలనీ కేసు.. గతేడాది టాలీవుడ్‌లో బయటపడిన పెద్ద కుంభకోణం. చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు తేలడంతో పలువురు సినీ ప్రముఖులతో పాటు 15 నుంచి 21 మందిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇండస్ట్రీకి చెందిన తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, కాదంబరి కిరణ్ తదితరులు ఉన్నారు. అక్రమ నిర్మాణాలు, ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు, లబ్ధిదారులకు అన్యాయం జరగడం ఈ కేసులో ప్రధాన ఆరోపణలు. ఇప్పుడు ఈ కేసు విచారణ పూర్తయింది.
2005 నుంచి 2020 వరకు జరిగిన అవకతవకలపై కమిటీ విచారణ చేసింది. ఈ మేరకు నవంబర్ 27న ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అక్రమాలకు 15 మందిని బాధ్యులను చేస్తూ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. పాత, ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందంటూ నివేదికలో పేర్కొంది. కమిటీలో ఉంటూ నిధులు కాజేసిన పలువురు సినీ పెద్ద పాత్రపై రిపోర్ట్‌లో కీలక అంశాలు పొందుపరిచింది. ఈ నివేదికలో తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్, బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానందం ,వల్లభనేని అనిల్‌తో పాటు పలువురి పేర్లు ఉన్నాయి. మొత్తం రూ.43.78 కోట్లు రికవరి చేయాలని రిపోర్ట్‌లో ఉంది. అదనంగా 18 శాతం చెల్లించాలని ఆదేశించారు.
(ఇదీ చదవండి: తనకంటే ముందు చెల్లి పెళ్లి చేస్తున్న మరో హీరోయిన్!)
ఏంటి చిత్రపురి కాలనీ కేసు?
మణికొండలోని సర్వే నం.246/1లో 67.16 ఎకరాల స్థలాన్ని తెలుగు సినీకార్మికుల సహకార హౌసింగ్ సొసైటీకి గతంలో ప్రభుత్వం కేటాయించింది. గజానికి రూ.40 చొప్పున ధరతో ప్రభుత్వం స్థలాన్ని ఇవ్వగా, 2002లో సొసైటీ.. సభ్యత్వ ప్రక్రియ ప్రారంభించింది. ఆర్థిక స్థితిగతులను బట్టి మూడు విభాగాల్లో ఇల్లు నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం 4300 మంది సభ్యులుగా చేరారు. తక్కువ ధరకు వచ్చిన భూమి కాలక్రమంలో ఐటీ కారిడార్ కావడం గజం రూ.లక్షల్లోకి చేరడంతో అక్రమాల పరంపర మొదలైంది.
సొసైటీలో సభ్యులకు ఫ్లాటు కేటాయింపునకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సహకార శాఖ, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్లు, ఇద్దరు సినీ ప్రముఖులతో కూడిన కమిటీ సంతకాలుండాలి. 2010, 2012, 2015లో ఆరుదశల్లో 4213 ఫ్లాట్ల కేటాయింపు పూర్తయింది. భూముల ధరలకు రెక్కలు రావడంతో కమిటీ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ అనర్హులకు ఫ్లాట్లు కేటాయించినట్లు ఆరోపణలున్నాయి. 4213 ఫ్లాట్లకు 9153 మందిని సొసైటీలో సభ్యులుగా చేర్పించడం గమనార్హం. రాజకీయ నేతల సూచనలతో అనర్హులను చేర్పించినట్లు తేలింది.
(ఇదీ చదవండి: బుకింగ్ ఓపెన్.. ఆ విషయంలో టెన్షన్ పెడుతున్న 'రాజాసాబ్')


