‘‘ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో మనం చాలా ఎమోషన్స్ చూశాం. కానీ, ఓ స్టార్ హీరో, ఫ్యాన్‌కి మధ్య ఉన్న భావోద్వేగాన్ని చెబుతూ, హ్యూమన్ ఎమోషన్‌ని కూడా టచ్ చేసిన సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఇలాంటి భావోద్వేగం ప్రపంచంలో ఎక్కడా లేదు... మన తెలుగు సినిమాకే సొంతం. మనం సినిమా లవర్స్... మంచి సినిమాకి గుర్తింపు వస్తూనే ఉంటుంది’’ అన్నారు రామ్ పోతినేని. మహేశ్‌బాబు పి. దర్శకత్వంలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 27న విడుదలైంది.
ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌లో వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి ప్రశంసలతో పోల్చుకుంటే వసూళ్లు కాస్త తక్కువగానే ఉన్నాయి. నెక్ట్స్ వీక్ అద్భుతమైన రన్ ఉంటుందని నమ్ముతున్నాం. నేటి నుంచి థియేటర్స్‌ని విజిట్ చేసి, ఫ్యాన్స్‌ని కలుసుకుంటాం’’ అని తెలిపారు. ‘‘ఈ చిత్రంలో మహాలక్ష్మిలాంటి మంచి పాత్ర చేసినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు భాగ్యశ్రీ. ‘‘ఇక్కడి నుంచి మా సినిమా చాలా లాంగ్ వెళ్లబోతోంది’’ అని మహేశ్‌బాబు పి. పేర్కొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్, మెర్విన్ మాట్లాడారు.


