కోలీవుడ్‌లో స్టార్ హీరోలుగా రాణిస్తున్నవారిలో శివకార్తికేయన్ ఒకరు. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న ఈయన ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పరాశక్తి. ఈ చిత్రం 2026లో పొంగల్ సందర్భంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం చెన్నైలో జరిగిన ఫ్యాన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో శివకార్తికేయన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వాస్తవాలు మాత్రమే ప్రచారం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పేరుతో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, టెలిగ్రామ్‌లో చాలా సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయని, వాటిని ఎవరెవరు నిర్వహిస్తున్నారో కూడా తెలియదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వాస్తవాలకు బదులుగా అసత్య ప్రచారాలే ఎక్కువ వైరలవుతున్నాయన్నారు. ఇలాంటి తరుణంలో ఫ్యాన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ ప్రారంభించడం స్వాగతించదగిన విషయమని, ఇది వాస్తవాలను మాత్రమే ప్రచారం చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాంటివారే ఇష్టం
తనకే మంచి మేధాశక్తి ఉంటే దర్శకులను విసిగించేవాడినని అన్నారు. అదేవిధంగా తనను ఆరాధించే అభిమానులు వద్దని, వారి తల్లిదండ్రులను, దైవాన్ని ఆరాధించేవారంటే ఇష్టమని పేర్కొన్నారు. తనను ఒక స్నేహితుడిగా, సోదరుడిగా భావించే అభిమానులే తనకు కావాలన్నారు. అలాంటి ఫ్యాన్స్‌ను తన కుటుంబ సభ్యులుగా భావిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్ శిక్షకుడు, పద్మ భూషణ్ పుల్లెల గోపీచంద్, ప్రపంచ చెస్ ఛాపింయన్ గుకేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ యాప్ నటీనటులకు, అభిమానులకు మధ్య అనుసంధానంగా నిలిచే యాప్ అని నిర్వాహకులు పేర్కొన్నారు.


