71 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు విశ్వనటుడు కమల్ హాసన్. యంగ్ హీరోలకు ధీటుగా ఏడాదికో సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఇటీవల ఆయనను రాజ్యసభ పదవి వరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సీనీ కెరీర్‌పై రకరకాల పుకార్లు వచ్చాయి. ఇక ఆయన సినిమాల్లో నటించబోరనే వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్ పై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదైనా ఓ మంచి సినిమా తీసి రిటైర్మెంట్ అవుతానని చెప్పారు.
తాజాగా ఆయన నటి మంజు వారియర్‌తో కలిసి కేరళలో అర్ట్ అండ్ లిటరేచర్‌పై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పదవి విరమణపై ఎదురైన ప్రశ్నకు పైవిధంగా సమాధానం చెప్పారు.
‘నన్ను రిటైర్ అవ్వమని ఎవ్వరూ అడగడం లేదు. కానీ కొన్నిసార్లు నాకే ఇక సినిమాలు ఆపేయాలనిపిస్తుంది. ముఖ్యంగా నా నుంచి వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన ప్రతిసారి అలానే అనిపిస్తుంది. కానీ నా శ్రేయోభిలాషులు, అభిమానులు మాత్రం సినిమాలు ఆపోద్దని చెబుతున్నారు. ‘ఒక మంచి సినిమా తీసి సినిమాలు ఆపేయండి’ అని సలహాలు ఇస్తున్నారు. నేను కూడా అలాంటి ఓ మంచి సినిమా కోసమే ఎదురు చూస్తున్నాను’ అని కమల్(Kamal Haasan) చెప్పుకొచ్చాడు.
మొత్తానికి ఓ బ్లాక్ బస్టర సినిమా తీసి సినీ కెరీర్‌కి గుడ్‌బై చెప్పాలని కమల్ భావిస్తున్నాడు. మరి ఆ చిత్రం ఎప్పుడొస్తుందో చూడాలి. ఇటీవల ఆయన ‘థగ్‌లైఫ్’తో ప్రేక్షకుల ముందుకు రాగా.. అది ఘోరంగా విఫలం అయింది. ప్రస్తుతం ఆయన చేతిలో కల్కి 2 చిత్రం ఉంది. అలాగే లోకేష్ కనగరాజ్‌తో విక్రమ్ 2 కూడా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. మరోవైపు రజనీకాంత్ హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు.


