నటిగా హీరోయిన్ కీర్తీ సురేష్ సూపర్ సక్సెస్ అయ్యారు. కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూ... సామాజిక అంశాలతో రూపొందే ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాల్లో విజృంభిస్తూ దూసుకెళుతున్నారు కీర్తి. ఈ నటిలో మరో కోణం కూడా ఉంది. అదే డైరెక్షన్. ‘‘భవిష్యత్తుతో నాకు దర్శకత్వం వహించే ఆలోచన ఉంది’’ అని కీర్తి చెబుతున్నారు. కీర్తీ సురేష్ టైటిల్ రోల్‌లో నటించిన ‘రివాల్వర్ రీటా’ సినిమా గత నెల 28న విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తనకు దర్శకత్వం వహించే ఆలోచన ఉందని కీర్తీ సురేష్ చెప్పారు.
‘‘నాకు డైరెక్టర్‌ని కావాలని ఉంది. అందుకే టైమ్ దొరికినప్పుడు లేదా ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏవైనా స్టోరీ ఐడియాస్ వస్తే వాటిని నోట్ చేసుకుంటున్నాను. గత ఐదు సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నాను. అంతేకాదు... నా దగ్గర ఉన్న స్టోరీ ఐడియాస్‌ను కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్‌తో షేర్ చేసుకుని, డెవలప్ చేయమని చెప్పాను.
అలాగే వాళ్ల స్టోరీస్, ఐడియాస్‌ను కూడా నేను వింటున్నాను’’ అని కీర్తీ సురేష్ చెప్పుకొచ్చారు. కీర్తి మాటలను బట్టి చూస్తే ఆమె దర్శకురాలు కావాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మరి... కీర్తీ సురేష్ దర్శకత్వంలో తొలి సినిమా ఎప్పుడు వస్తుంది? ఆమె ఏ తరహా కథలు రాసుకున్నారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. మరోవైపు ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’ సినిమాతో కీర్తీ సురేష్ నటిగా బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.


