హీరో మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లోని సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’. ఈ ‘దృశ్యం’ సిరీస్ నుంచి ఇప్పటికే ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో ఈ ఏడాది ‘దృశ్యం 3’ సినిమాను కూడా ప్రకటించారు మోహన్‌లాల్. ఈ ఏడాది సెప్టెంబరు మూడో వారం ‘దృశ్యం 3’ సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. డిసెంబరు 2న ఈ’ సినిమా చిత్రీకరణ ముగిసిందని యూనిట్ సోషల్ మీడియా మాధ్యమాల వేదికగా పేర్కొంది. ఇలా అతి తక్కువ సమయంలోనే ‘దృశ్యం 3’ సినిమా చిత్రీరకణ పూర్తి కావడం విశేషం.
ఇక ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరంబవూర్ నిర్మించిన ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లోనూ తెరకెక్కనుంది. ‘దృశ్యం 3’ తెలుగు వెర్షన్‌లో వెంకటేశ్, హిందీ వెర్షన్‌లో అజయ్ దేవగన్ నటిస్తారు. కాగా, ‘దృశ్యం 3’ సినిమాను మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తామన్నట్లుగా ఆ మధ్య దర్శకుడు జీతూ జోసెఫ్ చెప్పారు.
మరి... జీతూ జోసెఫ్ అనుకున్నట్లుగానే ‘దృశ్యం 3’ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... మోహన్‌లాల్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘వృషభ’ ఈ డిసెంబరు 25న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది మోహన్‌లాల్ హీరోగా నటించి, విడుదలైన ‘ఎల్2: ఎంపురాన్, తుడరుమ్, హృదయపూర్వం’ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఇంకా ‘దృశ్యం 3’ సినిమా తర్వాత రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘జైలర్ 2’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారట మోహన్‌లాల్.


