'ఆంధ్ర కింగ్ తాలూకా'.. ఎందుకు ఇలాంటి పరిస్థితి? | Andhra King Taluka Movie Result And Collection | Sakshi
Sakshi News home page

Andhra King Taluka: సినిమాకు పాజిటివ్ టాక్ కానీ కలెక్షన్స్ ఇలా.. ఎందుకిలా?

Dec 2 2025 1:20 PM | Updated on Dec 2 2025 1:27 PM

Andhra King Taluka Movie Result And Collection

టాలీవుడ్‌లో అప్పుడప్పుడు చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా అలాంటిదే ఒకటి జరిగింది. రామ్ హీరోగా నటించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా'.. గత వీకెండ్‌లో థియేటర్లలోకి వచ్చింది. సోషల్ మీడియాలో టాక్, మీడియాలో రివ్యూలు పాజిటివ్‌గానే వచ్చాయి. కానీ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లేదు. కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. మరి ఈ మూవీ విషయంలో లెక్క ఎక్కడ తప్పింది? ఇలా జరగడానికి కారణాలేంటి?

(ఇదీ చదవండి: 'కాంతార'పై కామెడీ.. క్షమాపణ చెప్పిన స్టార్ హీరో)

'ఆంధ్రకింగ్ తాలూకా' విషయంలో ఇలా జరగడానికి ఒకటి రెండు కాదు చాలానే కారణాలే ఉన్నాయనిపిస్తోంది. మొదటగా రిలీజ్ డేట్. సాధారణంగా నవంబరుని అన్-సీజన్ అని అంటుంటారు. చెప్పుకోదగ్గ మూవీస్ ఏం ఈ నెలలో విడుదల కావు. అయినా సరే నిర్మాతలు సాహసం చేశారు కానీ కలిసి రాలేదు. 'అఖండ 2' లాంటి పెద్ద హీరో సినిమా పెట్టుకుని వారం ముందు రిలీజ్ చేయడం కూడా ఓ రకంగా మైనస్ అయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద సినిమాలు రిలీజ్‌కి రెడీ ఉంటే అంతకు ముందు వారం పదిరోజుల్లో వేరే చిత్రాల గురించి ప్రేక్షకులు ఆలోచించే పరిస్థితి ఉండదు.

మరో కారణం చెప్పుకొంటే ఈ సినిమాలో చూపించింది యూనివర్సల్ కంటెంట్ కాదు. ఓ అభిమాని-హీరో మధ్య సాగే ఎమోషనల్ స్టోరీగా దీన్ని తెరకెక్కించారు. కాబట్టి హీరోలని పిచ్చిగా అభిమానించే కొందరికి మాత్రమే నచ్చుతుంది. సగటు ప్రేక్షకుడు ఎప్పుడూ ఏ హీరోని పిచ్చిగా అభిమానించడు, ఆరాధించడు. కాబట్టి ఈ విషయం ఏమైనా మైనస్ అయిందా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్!

(ఇదీ చదవండి: సమంత రెండో పెళ్లి.. నాగచైతన్య పాత వీడియో వైరల్‌)

ఈ సినిమాలో హీరో రామ్ మంచి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉండొచ్చు. హీరోయిన్ భాగ్యశ్రీతో కెమిస్ట్రీ సూపర్‌గా ఉండొచ్చు. అంతమాత్రాన ప్రేక్షకులు తమ సినిమాకు వచ్చేస్తారు అనుకోకూడదు. ఎందుకంటే ఓ హీరో నుంచి సినిమా వస్తుందంటే.. అతడి గత చిత్రాలేంటి? వాటి ఫలితాలేంటి అనేది కూడా ప్రేక్షకుడు ఆలోచిస్తాడు! రామ్ గత మూడు నాలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దీంతో రామ్ మార్కెట్ కాస్త డౌన్ అయింది. అలానే ఈ హీరో మాస్ ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు తీసింది క్లాస్ చిత్రం కావడంతో ఏమైనా తేడా కొట్టిందా అనిపిస్తుంది.

ప్రస్తుతం ఓటీటీ జమానా నడుస్తోంది. అంటే ట్రైలర్ రిలీజైనప్పుడే ఏ సినిమాని థియేటర్‌లో చూడాలి? ఏ మూవీని ఓటీటీలో చూడాలి అనేది ప్రేక్షకుడు ముందే ఫిక్స్ అయిపోతున్నాడు. బహుశా ఈ ట్రెండ్ ఎఫెక్ట్ 'ఆంధ్ర కింగ్ తాలూకా'పై పడి కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయా అనిపిస్తుంది. ఒకవేళ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమాని ఎక్కువమంది చూస్తే మాత్రం ఇది నిజమని ఫిక్స్ అయిపోవచ్చు. భాగ్యశ్రీ కూడా యాక్టింగ్ బాగానే చేస్తున్నప్పటికీ ఈమె మూవీస్ అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. లిస్టులోకి ఇప్పుడు ఇది కూడా చేరినట్లే!

ప్రమోషన్స్ సరిగా చేయకపోవడం కూడా మరో కారణం అనుకోవచ్చు. ప్రస్తుతం రొటీన్ ప్రమోషన్స్ చేస్తుంటే జనాలకు పెద్దగా పట్టించుకోవట్లేదు. సమ్‌థింగ్ డిఫరెంట్ ఉండాలి, కంటెంట్‌ ఏంటో విడుదలకు ముందే ఆడియెన్స్‌కి రీచ్ అయ్యేలా చేయాలి. సినిమా కోసం ఎంత కష్టపడినా మొక్కుబడి ఇంటర్వ్యూలు ఇచ్చేశాం, ఈవెంట్స్ చేసేశాం అంటే కుదరదు. కంటెంట్ ఎలా బాగున్నా సరే ప్రమోషన్స్ కూడా అంతే పకడ్బందీగా చేయాల్సి ఉంటుంది. బహుశా ఈ విషయంలోనూ 'ఆంధ్రకింగ్' వెనకబడ్డాడేమో?

ఈ సినిమా విషయంలో ప్రేక్షకుడినో ఇంకెవరినో తప్పుబట్టడానికి ఏం లేదు. ఎందుకంటే సినిమా ఫలితం అనేది చాలా వాటిపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు బాగున్న చిత్రాలు కూడా అనుకోని పరిస్థితుల్లో ఫ్లాప్ అవుతుంటాయి. ఇప్పుడు 'ఆంధ్ర కింగ్ తాలూకా' విషయంలోనూ అదే జరిగినట్లుంది.

(ఇదీ చదవండి: ‘ఆంధ్ర కింగ్‌ తాలుకా’ మూవీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement