టైటిల్: ఆంధ్రకింగ్ తాలుకా
నటీనటులు: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేశ్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవి శంకర్
దర్శకత్వం: మహేశ్‌బాబు పి.
సంగీతం: వివేక్-మెర్విన్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నూని
ఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్
విడుదల తేది: నవంబర్ 27, 2025
రామ్ పోతినేని ఖాతాలో హిట్ పడి చాలా ఏళ్లు అవుతుంది. ఆయన చివరగా `ఇస్మార్ట్ శంకర్`తో హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన రెడ్, ది వారియర్స్, స్కంధతో పాటు భారీ అంచనాలతో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ‘ఆంధ్రకింగ్ తాలుకా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాపై రామ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. చాలా నమ్మకంతో ప్రమోషన్స్ గట్టిగా చేశాడు. మరి ఈ చిత్రంలో అయినా రామ్ హిట్ ట్రాక్ ఎక్కడా? లేదా? సినిమా ఎలా ఉంది? రివ్యూ(Andhra King Taluka Review)లో చూద్దాం.
కథేంటంటే..
ఈ సినిమా కథంతా 2000-2003 మధ్యకాలంలో సాగుతుంది. సూర్య(ఉపేంద్ర) ఓ స్టార్ హీరో. ప్లాప్ సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్ తెప్పించే అభిమానులు ఉన్నారు. అయితే వరుసగా తొమ్మిది సినిమాలు డిజాస్టర్ కావడంతో.. తన కెరీర్‌లో 100వ మూవీతో ఎలాగైన భారీ హిట్ కొట్టాలనే కసితో ఉంటాడు. అయితే 100వ సినిమా షూటింగ్ మొదలైన కొన్నాళ్లకే ఆగిపోతుంది. ఇక సినిమా చేయలేనంటూ నిర్మాత చేతులెత్తేస్తాడు. ఆ సినిమా పూర్తి చేయాలంటే మూడు కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఆ డబ్బు కోసం మరో నిర్మాతకు ఫోన్ చేస్తే.. తన కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో తండ్రి పాత్ర చేయమని అడుగుతాడు. మొదట్లో ఒప్పుకోకపోయినా..తర్వాత ఆ పాత్ర చేసేందుకు ఒప్పుకుంటాడు.
ఈ విషయం నిర్మాతకు చెప్పేలోపే.. సూర్య అకౌంట్‌లో రూ. 3 కోట్లు వచ్చి చేరుతాయి. ఆ డబ్బు ఎవరేశారని ఆరా తీయగా..తన వీరాభిమాని సాగర్(రామ్ పోతినేని) గురించి తెలుస్తుంది. రాజమండ్రి సమీపంలోని గోడపల్లిలంక అనే ఒక చిన్న పల్లెటూరికి చెందిన సాగర్‌కు అంత డబ్బు ఎలా వచ్చింది? అసలు సాగర్‌కి హీరో సూర్య అంటే ఎందుకు అంత పిచ్చి? ప్రియురాలు మహాలక్ష్మీ(భాగ్యశ్రీ బోర్సె)ని దక్కించుకోవడం సాగర్ చేసిన చాలెంజ్ ఏంటి? ఆ చాలెంజ్‌లో సాగర్ గెలిచాలడా ఓడాడా? హీరోపై ఉన్న అభిమానం..సాగర్‌ని, తన ఊరిని ఎలా మార్చేసింది? అభిమానిని వెతుక్కుంటూ వచ్చిన హీరో సూర్యకి.. తెలిసొచ్చిన విషయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Andhra King Taluka Review).
ఎలా ఉందంటే..
స్టార్ హీరోలకు వీరాభిమానులు ఉంటారు. జీవితంలో ఒక్కసారి కూడా ఆ హీరోని నేరుగా చూడకపోయినా.. ఆయన కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతారు. డబ్బులు ఖర్చు పెట్టి మరీ సినిమాను ఆడించే అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి ఓ అభిమాని కథే ఈ సినిమా. ఇలా అభిమానిని ఆధారంగా చేసుకుని ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమా కథ చాలా డిఫరెంట్. ఈ స్టోరీ పూర్తిగా హీరో-అభిమాని చుట్టూనే తిరుగుతుంది. అందులోనే గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ ప్రేమ కథను చూపించారు.
దర్శకుడు మహేశ్ ఎంచుకున్న పాయింట్ డిఫరెంట్‌గా ఉన్నా.. దాన్ని తెరపై ఆకట్టుకునేలా చూపించడంలో మాత్రం తడబడ్డాడు. ఈ కథకు బలమైన ‘మూడు కోట్ల’ సీన్ కూడా కన్విన్సింగ్‌గా అనిపించదు. ఓ అభిమాని.. హీరోకే మూడు కోట్ల రూపాయలు ఇచ్చాడంటే..అతని ప్రభావం ఫ్యాన్‌పై బలంగా ఉండాలి. ఇందులో ఆ బలమైన సన్నివేశాలు కూడా సినిమాటిక్‌గా అనిపిస్తాయి. పైగా కథనం మొత్తం ఊహకందేలా సాగడం మరో మైనస్. అయితే పతాక సన్నివేశాలు మాత్రం హృదయాలను ఆకట్టుకుంటాయి.
స్టార్ హీరో సూర్య 100వ సినిమా ఆగిపోయే సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఈ వార్త బటయకు రావడం..బయ్యర్లు ధర్నాకు దిగడం.. మూడు కోట్ల కోసం హీరో ప్రయత్నాలు చేయడం..ఇవన్నీ కథపై ఆసక్తిని పెంచుతుంది. ఇక హీరో అకౌంట్‌లో రూ. 3 కోట్లు పడిన విషయం తెలిసిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. సూర్య వీరాభిమాని సాగర్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. రామ్ ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. ఇక హీరోయిన్ పరిచయ సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. వారిద్దరి పరిచయం.. ప్రేమలో పడడం..కాలేజీలో గొడవ..ఇవన్నీ రొటీన్‌గా సాగిపోతాయి.
హీరో.. తన ఫేవర్ హీరో కోసం ఒకసారి.. హీరోయిన్ కోసం మరోసారి పరుగులు తీస్తూనే ఉంటాడు కానీ కథనం మాత్రం నెమ్మది, అక్కడక్కడే తిరుగుతుంది. చాలా వరకు కథనం ఊహకందేలా సాగుతుంది. ఇక సెకండాఫ్ ప్రారంభంలోనే మూడు కోట్ల ట్విస్ట్ ఊహించొచ్చు. అయితే ఆయా సన్నివేశాలు మాత్రం ఎమోషనల్‌గా సాగుతాయి. ‘మహాలక్ష్మీ థియేటర్’ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్‌లో హీరో-అభిమాని మధ్య వచ్చే సీన్లు హృదయాలను హత్తుకుంటాయి. సినీ స్టార్స్ అభిమానులంతా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు.
ఎవరెలా చేశారంటే..
హీరో సూర్య వీరాభిమాని సాగర్ పాత్రలో రామ్ ఒదిగిపోయాడు. పేరుకు ఇది హీరో-ఫ్యాన్ స్టోరీనే కానీ ఇందులో ఎక్కువగా కనిపించేది ఫ్యానే. హీరో రామ్ ఒక్కడే ఈ కథను తన భూజాన వేసుకొని ముందుకు తీసుకెళ్లాడు. ఎమోషనల్ సీన్లలోనూ అద్భుతంగా నటించాడు. ఇక మహాలక్ష్మీ పాత్రకి భాగ్యశ్రీ న్యాయం చేసింది. ఇందులో ఆమెది కూడా కీలక పాత్రే. తెరపై చాలా అందంగా కనిపించింది. రామ్-భాగ్యశ్రీ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. స్టార్ హీరో సూర్య పాత్రలో ఉపేంద్రని తప్ప మరొకరిని ఊహించుకోలేం. ఆయన నిడివి తక్కువే అయినా.. కథపై చాలా ప్రభావం చూపించింది.
హీరో తండ్రిగా నటించిన రావు రమేశ్‌కు ఒకటి, రెండు బలమైన సన్నివేశాడు పడ్డాయి. రాహుల్ రామకృష్ణ, సత్య, మురళీశర్మ, తులసి తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. వివేక్ - మెర్విన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు జస్ట్ ఓకే. సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి నిడివి(166 నిమిషాలు) కాస్త తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్


