షాకింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్‌.. | No Other Choice Movie Telugu Review | Sakshi
Sakshi News home page

No Other Choice Review: కుటుంబం కోసం నాన్న చేసే రిస్క్.. ఓటీటీలో క్రేజీ మూవీ

Jan 11 2026 8:10 AM | Updated on Jan 11 2026 3:14 PM

No Other Choice Movie Telugu Review

ఏదేమైనా థ్రిల్లర్ సినిమాలు తీయడంలో కొరియన్ దర్శకుల తర్వాత ఎవరైనా అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో టాప్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా వీళ్ల పేర్లు ఉంటాయనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే రెగ్యులర్‌కి భిన్నంగా పార్క్ చాన్ వుక్ అనే దర్శకుడు తీసిన 'నో అదర్ ఛాయిస్' గురించి మాట్లాడుకుందాం. ఇది ఓ షాకింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్. ఇంతకీ ఇదెలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
మాన్సు అనే వ్యక్తి, 25 ఏళ్లుగా ఓ పేపర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. భార్య, కొడుకుతో చాలా సింపుల్‌గా బతికేస్తుంటాడు. ఒకరోజు ఎలాంటి వార్నింగ్ లేకుండా మాన్సుని ఉద్యోగం నుంచి తీసేస్తారు. దీంతో కొత్త ఉద్యోగం కోసం మాన్సు చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ ఎక్కడా జాబ్ దొరకదు. అప్పుడే ఇతడు ఎవరూ ఊహించని ఆలోచన చేస్తాడు. తనతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థుల్ని చంపేస్తే ఆ ఉద్యోగం తనకే వస్తుంది కదా అని భావిస్తాడు. మరి తర్వాత ఏం చేశాడు? చివరకు మాన్సుకి ఉద్యోగం దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయింది. కరోనా లాక్ డౌన్ టైంలో చాలామందికి ఉద్యోగాలు ఊడిపోయాయి. ఇప్పటికీ రంగంతో సంబంధం లేకుండా ఉద్యోగాలు పోతూనే ఉన్నాయి. ఎవరైనా ఉద్యోగం పోతే ఏం చేస్తారు? మరో జాబ్ చూసుకోవడం లేదా డబ్బులుంటే వ్యాపారం చేసుకుంటారు. కానీ తనతో పోటీలో ఉన్న వాళ్లని చంపేస్తే ఉద్యోగం తనకే దక్కుతుందని భావిస్తే.. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు.

నిరుద్యోగం ఒక మనిషిని  ఎంత క్రూరంగా మారుస్తుంది. కార్పొరేట్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంటుందో ఈ చిత్రంలో చాలా రా(RAW)గా చూపించారు. మరో దారిలేక ఓ సామాన్యుడు చేసే హింసాత్మక పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. పెట్టుబడీదారి వ్యవస్థకు చెంపదెబ్బ లాంటి మూవీ ఇది.

అలానే సినిమా చూస్తున్నంతసేపు 'దృశ్యం' గుర్తొస్తుంది. ఎందుకంటే కుటుంబా‍న్ని రక్షించుకునేందుకు ఓ తండ్రి ఏ స్థాయి వరకు వెళ్లాడు? ఈ క్రమంలో హత్యలు చేసేందుకు కూడా వెనుకాడకపోవడం, చివరకు పోలీసులకు దొరకకపోవడం లాంటివి చూసినప్పుడు 'దృశ్యం'తో పోలికలు కనిపిస్తాయి. కానీ రెండు వేర్వురు కాన్సెప్టులు.

ప్రారంభంలో డార్క్ కామెడీ టోన్‌లో ఉంటుంది. కాసేపటికి థ్రిల్లర్ జోన్‌లోకి మారిపోతుంది. అక్కడి నుంచి ఒక్కొక్కరిని మాన్సు చంపుతుంటే టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ప్రస్తుతం ఇది ముబీ ఓటీటీలో కొరియన్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. కుదిరితే ఒంటరిగానే చూడండి.

-చందు డొంకాన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement