వరలక్ష్మి నటించడం శరత్‌కు ఇష్టం లేదు.. నిర్మాతకు వార్నింగ్‌ ఇచ్చేవాడు: రాధిక | Radhika Sarathkumar Says Sarathkumar Does Not Like Varalakshmi Enters In Film Industry, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

వరలక్ష్మి నటించడం శరత్‌కు ఇష్టం లేదు.. నిర్మాతకు వార్నింగ్‌ ఇచ్చాడు : రాధిక

Mar 1 2026 3:43 PM | Updated on Mar 1 2026 5:39 PM

Radhika Sarathkumar Says Sarathkumar Does Not Like Varalakshmi Enters In Film Industry

ప్రముఖ నటుడు శరత్‌ కుమార్‌ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి,తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్‌. కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా..విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి..మెప్పించింది. క్రాక్, యశోద, వీరసింహారెడ్డి తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇలా తనదైన నటనతో తండ్రికి తగ్గ తనయగా పేరు సంపాదించింది. అయితే కూతురు సినిమాల్లోకి రావడం మొదట్లో శరత్‌కుమార్‌కి ఏమాత్రం నచ్చలేదట. యాక్టింగ్‌ వదంటూ ఆమెపై  సీరియస్‌ కూడా అయ్యాడట. ఒకానొక దశలో ఆమెకు చాన్స్‌ ఇచ్చిన నిర్మాతలకు ఫోన్‌ చేసి వార్నింగ్‌ కూడా ఇచ్చాడట. ఈ విషయాలన్నీ శరత్‌ కుమార్‌ సతీమణి రాధికా చెప్పారు. 

వరలక్ష్మీ స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘సరస్వతి’.ఈ నెల 6న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాధికా మాట్లాడుతూ.. ‘వరలక్ష్మి సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు శరత్‌ వ్యతిరేకించారు. ‘ఎలా నటిస్తావ్‌? నువ్వు యాక్ట్‌ చేయకూడదు’ అంటూ సీరియస్‌ అయ్యేవారు. ‘మా కుమార్తెను నటిగా ఎంపిక చేయొద్దు’ అంటూ నిర్మాతలకూ ముందే చెప్పేవారు. ఈ విషయాలన్నింటినీ తన తల్లితో కలిసి వరలక్ష్మి ఓ రోజు నాతో పంచుకుంది. 

దీనిపై నిర్ణయం తీసుకోలేనని చెప్పి.. సినిమా సెట్స్‌లో ఉన్న శరత్‌ వద్దకు వారిని తీసుకెళ్లా. అప్పుడు ఆయన.. నమితతో కలిసి ఓ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తున్నారు. నమితతో సినిమా పాట అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి(నవ్వుతూ..). మమ్మల్ని చూడగానే ఆయన కారవాన్‌లోకి వెళ్లిపోయారు. తర్వాత వరలక్ష్మి నటించేందుకు అంగీకరించారు. వరలక్ష్మి తొలి సినిమా (పోడా పోడి)ని చూడగానే.. తను గొప్ప నటి అవుతుందని చెప్పా. తెలుగు సినిమాపై దృష్టి పెట్టమని వరలక్ష్మికి సలహా ఇచ్చా.  ఆమె అదే ఫాలో అయింది. ఇప్పుడు వరలక్ష్మీని చూస్తుంటే గర్వంగా ఉంది’ అని రాధిక అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement