చెప్పుకోలేని బాధ, విపరీతమైన ఆలోచనలతో ఇబ్బందిపడుతున్నప్పుడు మానసిక చికిత్స తీసుకోవడం చాలా అవసరం. అలా తాను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు థెరపీ తీసుకుని చాలా మంచి పని చేశానంటోంది మలయాళ నటి పార్వతి తిరువోతు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. థెరపీ తీసుకోవడం అనేది నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయం.
అర్ధరాత్రి థెరపీ
కాకపోతే మనకు కరెక్ట్ థెరపిస్ట్ దొరకాలి. అందుకు నాకు చాలా సమయం పట్టింది. మొదట్లో నేను అమెరికన్ థెరపిస్ట్‌ను కలిశాను. అర్ధరాత్రి ఒంటిగంట, రెండు గంటల సమయంలో నాతో మాట్లాడేవారు. తర్వాత ఇక్కడే ఉన్న థెరపిస్ట్‌లను సంప్రదించాను. వారు నా సమస్యలేంటో గుచ్చిగుచ్చి అడిగి.. వాటిని వెలికితీసి మరింత బాధపెట్టేవారు.
చచ్చిపోవాలన్న ఆలోచనలు
అప్పటికే నేను తీవ్రమైన ఒంటరితనంతో బాధపడుతున్నాను. చచ్చిపోవాలన్న ఆలోచనలు కూడా వచ్చాయి. కరెక్ట్ థెరపిస్ట్ దొరికాక నా బాధకు ఉపశమనం లభించింది. నన్ను ఎంతో బాధపెట్టిన 2021 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి నెలల్ని నా జీవితంలో నుంచే తీసేశాను.
సినిమా
ప్రస్తుతం నేను కుటుంబం, ఫ్రెండ్స్, సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. పార్వతి బెంగళూరు డేస్, ఎన్ను నింటె మొయిదీన్, చార్లీ, ఉయరె, వైరస్, పుళు వంటి పలు చిత్రాల్లో నటించింది. దూత వెబ్ సిరీస్‌తో తెలుగువారికి సైతం పరిచయమైంది.
గమనిక: ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com


