నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘అఖండ 2:తాండవం’. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్‌లో రూ. 100, సింగిల్ స్క్రీన్లలో రూ. 75 పెంచుకునేందుకు వెలుసుబాటు కల్పిస్తూ ఉత్తర్వ్యూలు జారీ చేసింది. దీంతో పాటు ఈ నెల 4న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్స్‌కి కూడా అనుమతి ఇస్తూ.. టికెట్ ధరను రూ. 600గా నిర్ణయించింది.పెంచిన ధరలు పది రోజుల పాటు అమల్లో ఉంటాయి.
ఈ విధంగా టికెట్ల రేట్లను పెంచడం పట్ల పలువురు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు నచ్చినట్లుగా టికెట్ల రేట్లను పెంచి సామాన్యులపై భారం వేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా సీపీఐ నారాయణ(CPI Narayana ) కూడా అఖండ 2 టికెట్ల రేట్ల పెంపుపై స్పందించారు. వందల కోట్లలో సినిమాలు తీసి.. ఆ భారం సామాన్య ప్రజలపై వేయడం కరెక్ట్ కాదన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు.
ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసే నైతిక హక్కు లేదు
అఖండ 2( Akhanda 2 ) చిత్రానికి టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇలాంటి ప్రకటన వల్లే కదా ఐబొమ్మ రవిలాంటి వాళ్లు పుట్టుకొచ్చేంది. కోట్ల కోట్ల రూపాయలను ఖర్చు చేసి సినిమా తీసి.. ఆ భారమంతా ప్రజలపై వేస్తాననడం ఎంత వరకు న్యాయం? ఇలాంటి విలువలైన సినిమాలను చూడడానికి ఇష్టపడని ప్రజానీకం.. ఐబొమ్మ రవిలాంటి వాళ్లు చేసిన పైరసీని ఎంకరేజ్ చేనస్తున్నారు. మీరే కదా రవిని సృష్టిస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసే నైతిక హక్కులేదు.
రవి లాంటివాళ్లు పుడుతూనే ఉంటారు
సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదారు సినిమాలు వస్తున్నాయి. వాటికి కూడా సినిమా టికెట్ల రేట్లను పెంచుతారు. ఇలా పెంచుకుంటూ పోతున్నంత కాలం ఐబొమ్మ రవిలాంటి వాళ్లు వస్తూనే ఉంటారు. వాళ్లను ఆపడం ఎవరి తరం కాదు. ఇది స్వయంకృతాపరాధం. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే..ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి’ అని నారాయణ అన్నారు.


