వదలని వాన
● కొనసాగుతున్న అల్పపీడనం ● చైన్నెకు సమీపంలో బలహీనపడి కేంద్రీకృతం ● నేడు కూడా వర్షాలకు అవకాశం ● చైన్నె, శివారు ప్రాంతాల్లో సహాయక చర్యలు
జీవ రైల్వే స్టేషన్ వంతెన వద్ద నీళ్లు
దిత్వా బలహీన పడినప్పటికీ చైన్నె, శివారు జిల్లాలో వర్షం కురుస్తూనే ఉంది. వాయుగుండంగా మారిన దిత్వా రూపంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వర్షాలు కొనసాగాయి. ఆ తదుపరి తెరపించి తెరపించి వర్షం పడుతోంది. పుదుచ్చేరి – మహాబలిపురం మధ్యలోని మర్కనం వద్ద తీరాన్ని సమీపించిన దిత్వా, మళ్లీ చైన్నెకు సమీపంలో అల్పపీడనంగా బలహీన పడి తిష్ట వేసింది. ఈ ప్రభావంతో గురువారం కూడా వర్షాలు కొనసాగనున్నాయి. ఇక, వర్షాల ధాటికి జలమయమైన చైన్నె శివారులలోని ప్రాంతాలలో సహాయక చర్యలు విస్తృతం చేశారు.
సాక్షి, చైన్నె: చైన్నెకు సమీపంలో బలహీన పడ్డ దిత్వా రెండు రోజులు తిష్ట వేసిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో చైన్నె, శివారులోని తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలో సంవృద్దిగానే వర్షాలు పడ్డాయి. చైన్నెకు నీరు అందించే రిజర్వాయర్లు అన్ని నిండు కుండలుగా మారడంతో ఉబరి నీటిని విడుదల చేస్తూ వస్తున్నారు. మంగళవారం దిత్వా మరింత బలహీన పడి దిశను మార్చుకుంది. బుధవారం వేకు జామున ఇది మహాబలిపురం – పుదుచ్చేరికి మధ్యలోని మరక్కానం వద్ద తీరాన్ని సమీపించింది. ఈప్రభావంతో రాత్రంతా చైన్నె, శివారు జిల్లాలో ఎడ తెరపి లేకుండా ఉరుములు మెరుపులతో వర్షం పడింది. బుధవారం ఉదయం నుంచి తెరపించి తెరపించి వర్షం పడుతూ వస్తున్నది. తీరాన్ని తాకినట్టుగా కనిపించిన దిత్వా మరింత బలహీన పడి. మళ్లీ చైన్నె తీరానికి సమీపంలో సముద్రంలో అల్పపీడనంగా తిష్ట వేసింది. ఇది గురువారం మరింత బలహీన పడనుంది. ఈ దృష్ట్యా, చైన్నె, శివారు జిల్లాలోనే కాదు, విల్లుపురం, తిరువారూర్, నాగపట్నం, శివగంగై జిల్లాలో అనేక చోట్ల వర్షాలు పడుతున్నాయి. వేలూరు, తిరువణ్ణామలైలో అక్కడక్కడా వర్షం పడింది. చైన్నె, శివారు జిల్లాల్లో బుధవారం కూడా విద్యా సంస్థలకు సెలవు ఇచ్చేశారు.
వీడని వాన
చైన్నె, శివారులలో వర్షం వీడటం లేదు. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలలో నీరు చేరడంతో తొలగింపు పనులు వేగవంతం చేశారు. రెడ్‌హిల్స్, తిరుముల్‌లై వాయిల్ పరిసరాలో అనేక చోట్ల పడవల ద్వారా ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జలదిగ్బంధంలో చిక్కుకుని ఉన్న గృహాల నుంచి 25 మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. 24 వేల మంది శిబిరాలలో ఉన్నారు. వీరికి కావాల్సిన ఆహారం తదితర అన్ని రకాల సౌకర్యాలను అందిస్తున్నారు. చైన్నె ఓట్టేరిలో వర్షం దాటికి పురాతన భవనం పాక్షికంగా కూలింది. ఈ భవనానికి పక్కనే దుకాణంలో ఉన్న ముగ్గురు గాయపడ్డారు. భారీ వర్షం పడ్డప్పటికీ చైన్నెలోని 22 సబ్‌వేలలో నేరు చేరకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. మాధవరం, తిరువొత్తియూరు మనలి, ఎన్నూరు పరిసరాలలో 50 వేల మందికి మూడు పూట్ల ఆహారం అందజేశారు. వర్షం కారణంగా ఇళ్లు , పరిసరాలలోకి చేరిన 1,127 పాములను కూడా రక్షించారు. అగ్నిమాపక సిబంది, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు విరోచితంగా శ్రమించడంతో అనేక చోట్ల నీళ్లు తొలగింది. శివారులలో కొన్ని చోట్ల నీటి తొలగింపు శ్రమగా మారింది.అత్యదికంగా ఎన్నూరులో 13 సెం.మీ విమ్కో నగర్‌లో 12 , మనలి 11 సెం.మీ వర్షం పడింది. మేడవాక్కం, పళ్లికర ణైలలో 10 సెం.మీ వర్షం పడింది.


