న్యాయ వ్యవస్థలో మార్పులు అవసరం
వేలూరు: దేశ వ్యాప్తంగా ఉన్న పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయ వ్యవస్థలో మార్పులు అవసరమని వీఐటీ యూనివర్సిటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ అన్నారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీలో సీనియర్ న్యాయవాది వీసీ రాజగోపాలాచారి వర్ధంతి కార్యక్రమం వీఐటీ చాన్సలర్ విశ్వనాథన్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతినిధులు వీసీఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంజయ్ కిషన్ కౌల్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా చాలా కోర్టుల్లో మౌలిక వసతులు లేవని, చాంబర్లు లేవన్నారు. కోర్టుకు వచ్చే ప్రజలకు విశ్రాంతి గదులు లేవన్నారు. దేశ వ్యాప్తంగా ఈ పద్ధతి మారాలన్నారు. వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ మాట్లాడుతూ వీసీఆర్ వద్దకే వచ్చే కేసులకు ఎటువంటి రుసుము తీసుకోకుండా కేసులను వాదించి విజయం సాధించే వారన్నారు. పేద ప్రజల కేసుల పరిష్కారం కోసం ప్రభుత్వం, న్యాయమూర్తులు, న్యాయవాదుల సంఘాలు సంయుక్తంగా కలిసి కొత్త పద్ధతిని తీసుకు రావాలన్నారు. దేశ వ్యాప్తంగా న్యాయ వ్యవస్థ ముఖ్యమైనదని అయితే కేసులను త్వరగా పరిష్కరించడంలేదన్నారు. వీఐటీ ఉపాధ్యక్షులు, శేఖర్ విశ్వనాథన్, కార్యనిర్వహణ డైరెక్టర్ సంధ్యా పెంటారెడ్డి, సీనియర్ న్యాయవాదులు విజయరాఘవులు, సీనియర్ న్యాయవాదులు, వీసీఆర్ కుటుంబసభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


