మహా దీపోత్సవం
2,668 అడుగుల ఎత్తయిన అన్నా మలైయార్ కొండపై కాంతులీనిన కార్తీక మహాదీపం భక్తజనసంద్రమైన తిరువణ్ణామలై మారుమోగిన హరోంహరా నామస్మరణ
కమనీయం..
మహాకొండపై దేదీప్యమానంగా వెలుగుతున్న కార్తీక మహా దీపం
పంచమూర్తుల దర్శనం
ఆలయం ఎదుట వెలిగించిన దీపం
తిరువణ్ణామలై అన్నామలైయార్ కొండపై బుధవారం సాయంత్రం మహాదీపం దేదీప్యమానంగా ప్రకాశించింది. అగ్ని రూపంలో ఉన్న ముక్కంటిగా భావించే ఈ దీపాన్ని లక్షలాది మంది భక్తులు దర్శించుకుని తరించారు. హరోంహరా అంటూ తన్మయత్వం చెందారు.
వేలూరు: తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం ఉదయం భరణి దీపం, సాయంత్రం కార్తీక మహా దీపోత్సవాన్ని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 40 లక్షల మందికి పైగా భక్తులు తరలి వచ్చారు. దీంతో వేకువ జామున 2 గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణ నిర్వహించారు. వజ్ర కిరీటం, బంగారు కవచంతో స్వామిని అలంకరించారు. 4 గంటలకు శివాచార్యులు మేళ తాళాలు వేద మంత్రాల నడుమ పంచ బూత స్థలాలలో ఆలయ ప్రధాన అర్చకులు భరణి దీపాన్ని వెలిగించారు. అనంతరం భక్తులను దర్శించుకోవడానికి అనుమతించారు. భక్తులకు స్వామి వారి అలంకరణ చూపించిన అనంతరం అమ్మన్ సన్నిధి, వినాయకర్ సన్నిధిలో దీపాలు వెలిగించారు. ఆపై భరణి దీపాన్ని కాల భైరవ స్వామి సన్నదిలో భక్తుల దర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా భక్తులు హరోంహరా.. అంటూ నామస్మరణ చేసుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆలయం కింద ఆలయ అఽధికారులచే టపాకాయలు పేల్చిన సమయంలో ఆలయం వెనుక వైపునున్న 2,668 అడుగుల ఎత్తుగల కొండపై ఐదు అడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పు, మొత్తం 200 కిలోల బరువైన మహా దీప కొప్పరిలో 1,500 మీటర్ల గాడా గుడ్డ, 4500 కిలోల నెయ్యి, 20 కిలోల కర్పూరాన్ని ఉంచారు. సాయంత్రం 6 గంటలకు సంవత్సరానికి ఒక రోజు మాత్రమే భక్తులకు దర్శనం ఇచ్చే అర్థ నారేశ్వరుడు బయటకు వచ్చిన సమయంలో ఆలయం ముందు బాగం టపాకాయలు పేల్చి దీపాన్ని వెలిగించారు. వీటిని చూసిన వెంటనే మహా దీపం కొండపై శివాచార్యుల వేద మంత్రాలు, మేళ తాళాల నడుమ పారంపర్య వంశస్థులు కొండపై ఉన్న కొప్పరి వద్ద శంఖాన్ని ఊది అరుణాచలేశ్వరునికి హరోంహరా అంటూ నామస్మరణం చేసిన తర్వాత శివాచార్యులు మహాదీపాన్ని వెలిగించారు. ఈ దీపం కొండంత వెలుగు వెలగడంతో వీటిని భక్తులు చూసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ దీపం దర్శనార్థమై తమిళనాడు నుంచే కాకుండా ఆంధ్ర, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, మహారాష్ట్ర సహా దేశ విదేశాల నుంచి ఇటలీ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి దీపోత్సవాన్ని తిలకించారు. భక్తులు ఉదయం నుంచే ఉపవాసం ఉండి సాయంత్రం 6గంటలకు దీపాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఇళ్లలో దీపాలను వెలిగించి స్వామి వారికి మొక్కులు తీర్చుకొని ఉపవాస దీక్షను విరమించారు. ఈ మహా దీపోత్సవం సందర్బంగా భక్తులకు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, ట్రస్ట్‌లు, ఆలయ నిర్వాహకులు, రాజకీయ నాయకులు గిరివలయం రోడ్డులోను, ఆలయ సమీపంలోను తాగునీరు అందజేశారు.
బందోబస్తును పరిశీలించిన డీఐజీ ధర్మరాజన్
దీపోత్సవానికి సుమారు 45 లక్షల మంది భక్తులు పాల్గొననున్నారని 50 ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎక్కడా చోరీలు, ప్రమాదాలు జరగకుండా అదుపు చేసేందుకు భారీ బందోబస్తు ఏర్పాట్లను ఆలయం గది నుంచే పరిశీలించారు. అదే విధంగా కొండ చుట్టూ జరిగే ఘటనలను నిఘా ఉంచేందుకు రెండు మానవ రహిత మినీ విమానంలో కెమెరాలను ఉంచి ప్రత్యేక నిఘా ఉంచారు. దీపోత్సవానికి ఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో ఏడుగురు డీఐజీలు, 19 మంది ఎస్పీలు, కమోండో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు మొత్తం 15వేల మందితో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అదే విధంగా 64 ప్రాంతాల్లో తాత్కాలిక పోలీస్ కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో నిఘా ఉంచారు.
భక్తులకు 5,484 ప్రత్యేక బస్సులు,
16 రైలు ఏర్పాటు
దీపోత్సవానికి చైన్నె, విల్లుపురం, వేలూరు, గుడియాత్తం, బెంగుళూరు, సేలం, కోవై, మదురై, తిరిచ్చి, పుదుచ్చేరి, కాంచిపురం వంటి ప్రాంతాలను నుంచి ప్రత్యేక బస్సులను నడపారు. ప్రత్యేక బస్సులు నడిపినా భక్తులను అదుపు చేయలేక ట్రాన్స్‌పోర్టు అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. అదే విధంగా చైన్నె, విల్లుపురం, పుదుచ్చేరి నుంచి ప్రత్యేక రైలు ద్వారా భక్తులు అధిక సంఖ్యలో తిరువణ్ణామలైకి చేరుకున్నారు.
కార్తీక దీపోత్సవ వేళ మాత్రమే దర్శనం
ఇచ్చే అర్థ నారీశ్వరుడు
పంచదీపాల్లో నెయ్యి వేస్తున్న ఏపీ మాజీ మంత్రి రోజా, తమిళనాడు మంత్రి శేఖర్‌బాబు
గిరివలయం రోడ్డులో కిటకిట
మహా దీపోత్సవానికి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో గిరివలయం రోడ్డులో చేరుకున్నారు. బుధవారం ఉదయం నుంచి భక్తులు గిరివలయంలోని 14 కిలోమీటర్ల దూరం కొండను చుట్టి వచ్చి దీపోత్సవాన్ని దర్శించుకున్నారు. దీంతో 14 కిలోమీటర్ల దూరం భక్తులతో కిటకిటలాడింది. గిరివలయం రోడ్డులో వివిధ రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిదులు భక్తులకు స్వామి వారి ప్రసాదాలను అందజేయడంతో పాటూ అన్నదానం చేశారు. తిరువణ్ణామలైలో ఎటు చూసినా భక్త జనమే, ఎక్కడా విన్నా హరోంహరా నామస్మరణే వినిపించింది. భక్తుల హరోంహార నామ స్మరణాలతో తిరువణ్ణామలై పట్టణం పులకింపజేసింది. ఇదిలా ఉండగా ఈనెల పౌర్ణమి 4న ఉదయం 7.58 గంటల నుంచి 5వ తేదీన ఉదయం 5.37 గంటలకు ముగియడంతో ఆ సమయంలో భక్తులు గిరివలయం వెల్లవచ్చునని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు.
భరణి దీపంలో ప్రముఖులు
బుధవారం ఉదయం అరుణాచలేశ్వరాలయంలో జరిగిన భరణి దీపంలో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు, కలెక్టర్ తర్పగరాజ్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి, ఐజీ అశ్రా కర్క్, డీఐజీ ధర్మరాజన్, ఎస్పీ సుధాకర్ , ఆలయ జేసీ భరణీధరన్, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీధరన్, ప్రజా ప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.
మహా దీపోత్సవం
మహా దీపోత్సవం
మహా దీపోత్సవం
మహా దీపోత్సవం


