
మాకు పూర్వీకుల ఆస్తి భాగాలు చేయకుండా కొంత మిగిలి ఉంది. కొందరు వారసులు 1950 లలోనే దేశం విడిచి వెళ్లిపోయారు. వారికి పుట్టిన సంతానం కూడా జర్మనీ దేశంలో పుట్టారు – అక్కడ పౌరసత్వం కలిగి ఉన్నారు. ఇప్పుడు మాతోపాటు వారసులైన వారు సదరు ఆస్తిని మాకు గిఫ్ట్ లాగా ఇచ్చేస్తాము, మేము ఎక్కడికీ రాలేము అని అంటున్నారు. రిజిస్ట్రార్ వద్దకు వెళితే సరైన సమాధానం దొరకడం లేదు. ఇందుకు రిజర్వ్ బ్యాంకు నుంచి ఆమోదం పొందాలనో లేకపోతే పీ.ఐ.ఓ అనే ఒక కార్డు తీసుకోవాల్సి ఉంటుందనో చెబుతున్నారు. అది నిజమేనా? సరైన విధానం వివరించగలరు.
– రాజేష్, బిట్రగుంట
బహుశా రిజిస్ట్రేషన్ ఆఫీసులో మీకు చెప్పినవారు ఫెమా చట్టం – (ఊఉMఅ – ఫారిన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్ చట్టం, 1999) లోని ఎఫ్.ఈ.ఏం. (నాన్ – డెట్ – ఇన్‌స్ట్రుమెంట్స్) నిబంధనలు, 2019 లోని సెక్షన్ 30(2) గురించి సూచించి ఉండవచ్చు. ఈ నిబంధనల ప్రకారం విదేశాలలో నివసిస్తున్న వారు (ఇతర దేశ పౌరసత్వం కలిగిన వారు సైతం) సాధారణంగా భారతదేశంలో తమకు ఉన్న ఆస్తిని అమ్మటానికి వీలుపడదు. అయితే ఇదేమీ ఖచ్చితమైన నిబంధన కాదు. అందుకు మినహాయింపులు ఉన్నాయి. మరొక విదేశీయునికి ఆస్తి అమ్మడంపై, నగదు లావాదేవీలు ఉండటం వంటి సందర్భాలలో రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆమోదం పొందడం, భారతీయ బ్యాంకు ద్వారానే సదరు లావాదేవీని చేయడం వంటి నిబంధనలు ఉన్నాయి.
అంతేకానీ భారతదేశంలో ఉండే ఒక భారతీయుడికి ఆస్తిని బదిలీ చేయడం పై ఎటువంటి నిషేధమూ లేదు. మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే ఇలాంటి పరిమితులు మీకు వర్తించవు. ఎందుకంటే FEMA చట్టంలోని సెక్షన్ 6(5) ప్రకారం విదేశాలలో ఉండే పరాయి దేశస్థులు కూడా భారతదేశంలో ఆస్తిని కలిగి ఉండవచ్చు. అలాంటి ఆస్తి స్వార్జితం అవ్వచ్చు లేదా వారసత్వంగా కూడా వచ్చి ఉండవచ్చు.
మీరు రిజర్వు బ్యాంకు నుంచి ఎటువంటి ఆమోదాలు పొందవలసిన అవసరం లేదు. అయితే మీ తోటి వారసులు భారతదేశానికి రాలేరు అని చెప్పారు కాబట్టి, వారిని ఒక జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ లేదా స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ పంపమని చెప్పండి. సదరు పవర్ ఆఫ్ అటార్నీని జర్మనీలోని భారతీయ ఎంబసీ ద్వారా ధ్రువీకరించి (అటెస్టేషన్ చేసి) పంపినట్లయితే మరలా ఇక్కడ రిజిస్టర్ చేయవలసిన అవసరం (లేదా) ఇన్పౌండింగ్ చేయవలసిన అవసరం ఉండదు.
అలా కానిపక్షంలో నోటరీ చేయించిన పవర్ ఆఫ్ అటార్నీ అయితే ఇక్కడ రిజిస్టార్ ఆఫీసుకు వెళ్లి సదరు దస్తావేజును ధ్రువీకరించుకుని అప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ పొందిన వ్యక్తి ద్వారా మీరు మీ పూర్వీకుల ఆస్తిని బదిలీ చేయించుకోవచ్చు. ఇది మీకు ఉన్న సులభమైన పద్ధతి. పవర్ ఆఫ్ అటార్నీ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి ముందుగానే ఒక లాయర్‌ని సంప్రదించి పవర్ ఆఫ్ అటార్నీ సరిగా రాయించుకోవటం మంచిది.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు).
(చదవండి: స్వరంతో ఉర్రూతలూగించే..స్పాటీఫై క్వీన్ పరమజీత్ కౌర్..!)