
ఇటీవలే ఒక జాతీయ బ్యాంకు వారు జారీ చేసిన పత్రికా ప్రకటనలో ఇల్లు వేలంపాట ద్వారా అమ్మకానికి పెడుతున్నట్లు చూశాను. అందులో ఏవేవో కేసు నంబర్లు కూడా ఉన్నాయి. ఆ ఇంటికి వెళ్లి చూడగా మాకు బాగా నచ్చింది. ఆ ఇంటి పూర్వ యజమాని లోను కట్టలేకపోవటం వలన బ్యాంకు వారు డీఆర్‌టీలో కేసు వేయడం ద్వారా ఇల్లు వేలానికి వచ్చిందని తెలిసింది. ఇలాంటి ఇంటిని వేలంపాటలో కొంటే ఏమైనా సమస్యలు వస్తాయా? తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
– కిషోర్ కుమార్, వరంగల్
మీరు చూసిన ప్రకటన డీఆర్.టీ (డెట్ రికవరీ ట్రిబ్యునల్) కేసుకు సంబంధించి అయి ఉండవచ్చు. ఎవరైనా ఇంటి లోను/ఆస్తిపై లోను తీసుకొని తిరిగి కట్టలేని పక్షంలో దశలవారీగా బ్యాంకు వారు తగిన నోటీసులు జారీ చేసి, అప్పటికి కూడా బకాయిలు చెల్లించకపోతే ఆస్తి/ఇంటి పొజిషన్ తీసుకోవడానికి చర్యలు చేపడతారు.
అక్కడ చట్టం ప్రకారం పొజిషన్ తీసుకోవడానికి సైతం బ్యాంకు వారికి ఎటువంటి కోర్టు ఆర్డర్ అవసరం లేదు. పొజిషన్ పొందిన బ్యాంకు వారు వేలంపాట వరకు వస్తే, అలాంటి ఆస్తిని/ఇంటిని వేలంపాటలో పాల్గొని, కొనుగోలు చేసే ముందు అన్ని పత్రాలను, కోర్టు ఉత్తర్వులను, బ్యాంకు వారి పొజిషన్ విధానం మొదలైన వాటిని క్షుణ్ణంగా చూసుకొని కొనుక్కున్నవారికి సాధారణంగా ఎటువంటి ఆటంకాలు రాకపోవచ్చు. వేలంపాట సమయంలోనే మీరు బ్యాంకు సూచించినంత (సుమారు 25%) డిపాజిట్ రూపంలో జమ చేయాల్సి ఉంటుంది.
మిగతా డబ్బులు చెల్లించడానికి మీకు గరిష్టంగా మూడు నెలల సమయం వరకు ఇవ్వవచ్చు. అయితే ఇలాంటి ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు చూసుకోవలసిన కొన్ని అంశాలు...
1) ఇంకా ఏమైనా కోర్టు కేసులు – ముఖ్యంగా డీ.ఆర్.టీ. లో ఏమైనా పెండింగ్ ఉన్నాయా
2) బ్యాంకు వారికి పూర్తి పొజిషన్ ఉందా లేక సింబాలిక్ పొజిషన్ ఉందా
3) కొనుగోలు దారునికి పొజిషన్ ఎన్నాళ్ళకు ఇవ్వవచ్చు?
4) ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ద్వారా సదరు ఆస్తిపై ఇంకెవరికైనా హక్కులు ఉన్నాయా లేదా
5) ఏదైనా సంస్థకు ఆస్తి పన్ను, బిల్లులు వంటివి ఏమైనా బకాయిలు ఉన్నాయా
6) ఆస్తి/ఇంటి పై అనుమతులు లేని కట్టడాలు / మార్పులు ఏమైనా చేశారా? (చేస్తే బ్యాంకు వారి తగిన మార్పులు, సవరణలు చేసి ఇవ్వాలి)
పైన సూచించిన అంశాలు మాత్రమే కాకుండా ఇంటి పత్రాలను, కోర్టుపత్రాలను, బ్యాంకు లావాదేవీ పత్రాలను, పత్రికా ప్రకటనలను కూడా మీకు దగ్గరలోని అనుభవజ్ఞులైన ఒక లాయర్ గారి దగ్గరికి తీసుకువెళ్లి అభిప్రాయం తీసుకుంటే మంచిది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే బ్యాంకు వారిని అదనపు పత్రాలు ఇవ్వవలసిందిగా కోరవచ్చు.
శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాద మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం
sakshifamily3@gmail.comMýSకు మెయిల్ చేయవచ్చు.
(చదవండి: ఎవరీ'లేడీ టార్జాన్'? ఏకంగా రాష్ట్రపతి భవన్‌లో విందుకు ఆహ్వానం..)