డిజిటల్‌ ప్రేమలు... డిస్కనెక్టెడ్‌ మనసులు... | How digital media turned us all into dopamine addicts | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ ప్రేమలు... డిస్కనెక్టెడ్‌ మనసులు...

Nov 16 2025 12:38 PM | Updated on Nov 16 2025 12:54 PM

How digital media turned us all into dopamine addicts

సమయం రాత్రి 10:47 గంటలు. అనూష ఫోన్‌ చేతిలో పట్టుకుని కూర్చుంది. స్క్రీన్‌ మీద ‘‘సీన్‌’’ అని కనిపిస్తోంది కానీ రిప్లై లేదు. ఆ నిశ్శబ్దం ఆమె మనసులో తుఫాను రేపుతోంది.తల్లి పిలిచినా వినిపించడం లేదు. కళ్ళలో తడి, మనసులో ఆందోళన, గుండెలో నొప్పి. మెదడులో ఒకే ఆలోచన – ‘ఆకాశ్‌కు నేను అంత ముఖ్యం కాదా?’ ఇది అనూష ఒక్కరి సమస్య మాత్రమే కాదు, వేలాది యువ హృదయాల్లో ప్రతి రాత్రి జరుగుతున్న డిజిటల్‌ డ్రామా. 

ఈ తరంలో ప్రేమ ఫోన్‌లో మొదలవుతోంది, ఫోన్‌లోనే ముగుస్తోంది. ప్రేమలో ఓపిక పోయింది, అర్జెన్సీ వచ్చింది. ఇప్పుడు బంధాలు షార్ట్‌ వీడియోస్‌లా మారాయి. చూసి, వెంటనే మరచిపోతున్నారు. కాని, సున్నిత మనస్కులు ఆందోళనలో, డిప్రెషన్‌లో చిక్కుకుపోతున్నారు. 

వాంఛగా మారిన ప్రేమ
ఒకప్పుడు ప్రేమంటే మనసుల కలయిక. ఇప్పుడది బాడీ ఇమేజ్‌ల కలయిక అయింది. స్మార్ట్‌ఫోన్లు పిల్లలకు 13 ఏళ్ల వయసులోనే అశ్లీల కంటెంట్‌ను అందిస్తున్నాయి. ప్రేమంటే శరీరాన్ని సంతృప్తిపరచడమే అని పోర్నోగ్రఫీ వారి మెదడుకు చెబుతోంది. కాని, ప్రేమంటే శాంతి అని మనసు హెచ్చరిస్తోంది. ఈ గందరగోళమే వారిలో అపరాధభావం, అభద్రత, ఒంటరితనాలకు కారణమవుతోంది. అందుకు వారిని తప్పుపట్టకుండా, సరైన మార్గంలో నడిపేందుకు ప్రాధాన్యమివ్వాలి. 

డోపమైన్‌ అడిక్షన్‌... 
ప్రేమంటే మెదడులో జరిగే రసాయన అద్భుతం. ఆక్సిటోసిన్, డోపమైన్, సెరటోనిన్‌ – ఇవే మనం ప్రేమగా అనుభవించే హార్మోన్‌లు. కానీ స్మార్ట్‌ఫోన్‌ వాటిని హైజాక్‌ చేస్తోంది. ప్రతి నోటిఫికేషన్‌కు డోపమైన్‌ విడుదలవుతోంది. ఇప్పుడు ప్రేమలోని ఆనందానికి కాదు, ఫోన్‌ వల్ల విడుదలయ్యే డోపమైన్‌ ఇచ్చే ఆనందానికి బానిస అవుతున్నారు. ప్రేమ కంటే రెస్పాన్స్‌ టైమ్‌ ముఖ్యమైపోయింది. ఇప్పుడీ డిజిటల్‌ యుగం కొత్త మానసిక వ్యాధి – డోపమైన్‌ అడిక్షన్‌. 

ఎందుకింత గాఢత?
టీనేజ్‌ వయస్సులో మెదడులోని ప్రీఫ్రంటల్‌ కార్టెక్స్‌ (తర్కం, నియంత్రణ కేంద్రం) ఇంకా ఎదగలేదు. కాని, అమిగ్డాలా (భావోద్వేగ కేంద్రం) చాలా చురుకుగా ఉంటుంది. అందుకే టీనేజ్‌ ప్రేమలు విపరీతంగా అనిపిస్తాయి, కనిపిస్తాయి. వాళ్లు ప్రేమను కాకుండా, ప్రేమ ఇచ్చే ఫీలింగ్‌ ను ప్రేమిస్తారు. స్మార్ట్‌ఫోన్‌ ఆ ఫీలింగ్‌ను 24 గంటలూ ఇస్తుంది. అందుకే ఫోన్‌ లేకపోతే విరక్తి, సైలెన్స్‌ అంటే తట్టుకోలేని ఆందోళన. ఇది నిజానికి ఫీలింగ్‌ అడిక్షన్‌. 

ప్రేమంటే చాట్‌ విండో... 
ఇప్పుడు ప్రేమంటే కవిత్వం కాదు, చాట్‌ విండో. ‘టైపింగ్‌’... అని కనిపిస్తే గుండెల్లో ఉత్సాహం. ‘లాస్ట్‌ సీన్‌’ అని కనబడితే బాధ. లైక్స్, హార్ట్‌ ఎమోజీలు, ఫోటోలు – ఇవే కొత్త అఫెక్షన్‌ సింబల్స్‌. ఈ ప్రేమలో ముఖాలు కనెక్ట్‌ అవుతున్నాయి కాని, మనసులు డిస్కనెక్ట్‌ అవుతున్నాయి. 

ఒకప్పుడు ప్రేమ అంటే రెండు హృదయాల కలయిక. ఇప్పుడు రెండు స్క్రీన్‌ల కలయిక. ఒకప్పుడు బ్రేకప్‌ అంటే కన్నీళ్లు, ఉత్తరాలు, జ్ఞాపకాలు. ఇప్పుడు బ్రేకప్‌ అంటే – ‘బ్లాక్డ్‌’. ఒక క్లిక్‌తో మనిషిని జీవితంలో నుంచి తొలగించవచ్చు. కాని, మనసులోంచి? అసాధ్యం.

పెరుగుతున్న ఒంటరితనం...
ఇప్పుడు పిల్లలు ఎప్పుడూ ఆన్‌లైన్‌లో ఉంటారు కాని, మనసు లోపల మాత్రం ఖాళీగా ఉంటారు. వేలాదిమంది ఫాలోవర్లు ఉన్నా, వారిని అర్థం చేసుకునే ఒక్క మనసు కూడా ఉండదు. జర్నల్‌ ఆఫ్‌ అడాల్సెంట్‌ హెల్త్‌ (2024) ప్రకారం రోజుకు ఐదు గంటలకు పైగా సోషల్‌ మీడియా వాడే టీనేజ్‌లో డిప్రెషన్‌ రేటు27 శాతం ఎక్కువగా ఉంది. వారు ఫోన్‌లో కనెక్ట్‌ అవుతున్నారు కాని, మనసుతో కనెక్ట్‌ అయ్యే సామర్థ్యాన్ని కోల్పోతున్నారు.

ఎలా రక్షించాలి ఈ తరం మనసును
1. ప్రేమలో కూడా ఫోన్‌కు ఒక సమయం ఉండాలి. ప్రతిరోజూ ప్రతి నిమిషం కనెక్ట్‌ కావడం కాదు,
కొంచెం దూరంగా ఉండటం, వేచి ఉండటం నేర్చుకోవాలి. దూరం బంధాలను బలపరుస్తుంది. 
2. మీ ప్రేమకు ‘నో’ చెప్పారంటే మీరు ఓడిపోయినట్లు కాదు. ప్రేమలో ‘లేదు’ కూడా ఒక జవాబు అని అర్థం చేసుకోవాలి. భావోద్వేగ అవగాహన నేర్పాలి.
3. చాట్‌లో ఉన్న ఎమోజీల కంటే కళ్లలో కనిపించే భావం గొప్పది. ముఖాముఖి సంభాషణ మీ ప్రేమను బలపరుస్తుంది.
4. పిల్లలతో ప్రేమ, శరీరం, భావోద్వేగాల గురించి మాట్లాడాలి. సిగ్గు పడకుండా సెక్స్‌ ఎడ్యుకేషన్‌ అందించాలి. ఎందుకంటే తెలియకపోవడం కంటే తప్పుగా తెలుసుకోవడం ప్రమాదం.
5. ‘‘ఏం చూస్తున్నావు?’’ అని అడగడం కాదు,‘‘ఏం ఫీలవుతున్నావు?’’ అని అడగాలి. పిల్లల మనసులను ఫోన్‌తో కాకుండా మన ప్రేమతో నింపాలి. 
సైకాలజిస్ట్‌ విశేష్‌, ఫౌండర్, జీనియస్‌ మేట్రిక్స్‌ హబ్‌ 

(చదవండి: గాజు డిస్క్‌: చిన్నదేగానీ..చిరంజీవి)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement