శ్రీనివాస్ గిఫ్ట్ అండ్ ఆర్టికల్ వ్యాపారి. ఓ నిర్మాణ సంస్థ ఎల్బీనగర్‌లో నిర్మించిన వాణిజ్య సముదాయంలో స్థలాన్ని కొనుగోలు చేశాడు.
శ్రీనివాస్ గిఫ్ట్ అండ్ ఆర్టికల్ వ్యాపారి. ఓ నిర్మాణ సంస్థ ఎల్బీనగర్‌లో నిర్మించిన వాణిజ్య సముదాయంలో స్థలాన్ని కొనుగోలు చేశాడు. కొని రెండేళ్లు దాటింది కూడా! ఇంతవరకూ బాగానే ఉంది.. అసలు కథ ఇప్పుడే మొదలైంది. రుణం చెల్లించట్లేదని బ్యాంకు ఆ ప్రాపర్టీని వేలానికి ప్రకటించింది. ఈ నెలలోనే ఆక్షన్ కూడా ఉంది. తద్వారా బ్యాంకు రుణాన్ని రికవరీ చేసుకుంటుంది. మరి, ఆ ప్రాపర్టీలో స్థలాన్ని కొన్న, లీజుకు తీసుకున్న వారి సంగతేంటి? పోనీ, శ్రీనివాస్ కొనుగోలు చేసిన స్థలాన్ని విక్రయిద్దామంటే ఆ ప్రాపర్టీకి అసలు నిర్మాణ అనుమతులే సరిగా లేవు. ప్లాన్‌లో ఒకటుంటే.. నిర్మాణం మరోలా తయారైంది!
సాక్షి, హైదరాబాద్: .. ఇలాంటి పరిస్థితి ఒక్క శ్రీనివాస్‌దే కాదు.. ప్రాపర్టీని కొనుగోలు చేసేముందు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోకుండా కొనే ప్రతి ఒక్కరిదీనూ!!
రుణ గ్రహీత వరుసగా ఆరు నెలలు తాను చెల్లించాల్సిన అప్పును చెల్లించకుంటే ఇక ఆ ప్రాపర్టీ నిరర్ధక ఆస్తి (ఎన్‌పీఏ) బాట పడుతుందని అధికారులు గుర్తిస్తారు. ముందుగా రుణగ్రహీతకు 60 రోజుల నోటీస్ పీరియడ్‌ను ఇస్తారు. అయినా చెల్లించని పక్షంలో మరో 30 రోజుల పాటు రెండో నోటీస్ అందిస్తారు. అయినప్పటికీ డిఫాల్టర్ పట్టించుకోకపోతే ఆ ప్రాపర్టీని ఎన్‌పీఏ జాబితాలో చేర్చుతారు. దాన్ని సెక్యూరిటీ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ (ఎస్‌ఏఆర్‌ఎఫ్‌ఏఈఎస్‌ఐ) చట్టం ప్రకారం వేలం వేస్తారు.
⇔ ఆసక్తి ఉన్నవారు ప్రాపర్టీ విలువలోని 10–15 శాతం సొమ్మును డిపాజిట్ చేసి బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. కేవైసీ వెరిఫికేషన్, డిజిటల్ సంతకాలు వంటివి పూర్తయ్యాక వేలం మొదలవుతుంది. డ్రాలో పేరొచ్చిన వారికి ఆ ప్రాపర్టీ దక్కుతుంది. ఇక 25 శాతం సొమ్మును చెల్లించి ప్రాపర్టీని కొనుగోలు చేస్తున్నట్లు బిడ్డర్ ధృవీకరించుకోవాలి. మిగిలిన సొమ్ముకు 10–15 రోజుల సమయంలో చెల్లించే అవకాశముంటుంది. వేలం ప్రధాన ఉద్దేశం రుణ గ్రహీత నుంచి బకాయిని వసూలు చేసుకోవటమే. ఒకవేళ బిడ్ మొత్తం బకాయి కంటే ఎక్కువొస్తే మిగిలిన సొమ్మును రుణ గ్రహీతకే ఇచ్చేస్తారు.
వేలంలో చిక్కొద్దు..
⇔ ప్రాపర్టీ టైటిల్, స్థానిక సంస్థల అనుమతులు, నిర్మాణ ప్లాన్, వసతులు వంటివి సక్రమంగా ఉన్నాయా? లేవా? అన్నవి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. లేకపోతే బ్యాంకు మీకు రుణం ఇవ్వదు. అంతేకాదు ఆ ప్రాపర్టీని మీరు తిరిగి అమ్ముకునే అవకాశమూ ఉండదు.
⇔ మున్సిపల్ రికార్డులను, పన్ను రికార్డులను అన్నింటినీ తనిఖీ చేయాలి. ఆ ప్రాపర్టీకి ఒకే యజమానా? లేక బృందంగా ఉందా? అసలా ప్రాపర్టీ మీకు ఎలా బదిలీ చేయబడిందనే విషయాన్ని పరిశీలించాలి.
⇔ వేలంలో బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది కదా అని తొందరపడి వేలంలో పాల్గొనవద్దు. విద్యుత్ బిల్లులు, సొసైటీ బకాయిలు వంటివి ఏమైనా ఉన్నాయా అనేవి సరిచూసుకోవాలి. .
⇔ మధ్యవర్తులనో లేక బ్యాంక్ వేలం ప్రకటననో గుడ్డిగా నమ్మి బిడ్డింగ్ వేయకూడదు. బిడ్డింగ్ వేయకముందే ప్రాపర్టీ ఉన్న ప్రదేశం, నిర్మాణం నాణ్యత, మార్కెట్ రేటు, ఇతర ప్రాపర్టీల విలువ వంటివి తనిఖీ చేయాలి.