
ఒక సామాన్య మహిళ అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందుకుంది. ఆమె సెలబ్రిటీ/మోడల్/క్రీడాకారిణో కాదు. సాదాసీదాగా ఓ మారుమూల ప్రాంతంలో నివశించే గ్రామీణ మహిళ. ఆమెకు భారత ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని ఎందుకు ఇస్తుందో తెలుసా..!.
టార్జాన్ మహిళగా పిలిచే ఆమె పేరు జమునా తుడు( Jamuna Tudu). చేతిలో ఒక కర్రతో అడవంతా కలియతిరిగే ఆమెకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan)లో విందుకు ఆహ్వానం లభించింది. ఎందుకు ఆమెకింత గౌరవం అంటే..పద్మశ్రీ అవార్డు గ్రహిత అయిన ఆమె అటవీ నిర్మూలన, అక్రమ కలప నరికివేతలకు వ్యతిరేకంగా పాటుపడిన ప్రకృతి మాత. అడవిని ఇంతలా కంటికి రెప్పలా కాచ్చుకున్న ఆమె ప్రస్థానం ఏవిధంగా సాగిందంటే..
జార్ఖండ్‌కి చెందిన జమునా చేతిలో ఒక కర్రతో అచ్చం పోలీసుల మాదిరిగా అడవులను గస్తీ కాస్తుంటుంది. ముఖ్యంగా అక్రమ కలప నరికివేతకు వ్యతిరేకంగా నిరసన తెలిపేది(చట్టం ఉల్లంఘమైన పని కలప కోత, కొనుగోలు, అమ్మకం). అంతేగాదు అడవులను రక్షించుకునేలా గ్రామస్తులను, స్థానికులను చైతన్యపరిచేది. అడవిని కాపాడుకోవలన్న లక్ష్యం పట్ల అచంచలమైన స్థెర్యాన్ని, తెగువని చూపేది.
ఆ లక్ష్యంలోకి మరికొంత మంది మహిళలకు స్వచ్ఛంగా భాగస్వామ్యం అయ్యేలా చేసింది. అలా ఇవన్నీ అట్టడుగు స్థాయి అటవీ సంరక్షణ ఉద్యమానికి దారితీశాయి. ఈ క్రమంలో తనపై ప్రాణాంతక దాడులు జరిగినా వెనుకడుగు వేయలేదామె. ఆ ఇబ్బందులన్నింటిని నేరుగానే ఎదుర్కొంది. సాధారణ దినసరి కూలీగా, ఒక మేస్త్రీ భార్యగా జమునా అసామాన్యమైన పోరాటం అందరికీ స్ఫూర్తిని కలిగించింది.
అంతేగాదు అడువుల రక్షణ కోసం ఆమె చేసిన అవిశ్రాంత పోరాటం కారణంగానే ఆమెకు 'లేడీ టార్జాన్'గా పేరొచ్చింది. ఆ నేపథ్యంలోనే ఆమెకు ఇంతటి గౌరవం లభించింది. దీనిపై జమునా స్పందిస్తూ..ఈ ఆహ్వానం తన మనోధైర్యాన్ని పెంచడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ రంగంలో పనిచేస్తున్న ఇతర మహిళలకు కూడా ప్రేరణ కలిగిస్తుందని పేర్కొంది. అలాగే ఈ గౌరవం తన పోరాటం, నిస్వార్థ సేవకు గొప్ప నిదర్శనమని సగర్వంగా చెబుతోందామె.
(చదవండి: స్వచ్ఛ భారత్ కోసం విదేశీయుడి తపన..! నెటిజన్ల ప్రశంసల జల్లు)