భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో 500కు పైచిలుకు పరుగులతో సత్తా చాటిన జార్ఖండ్ డైనమైట్.. జట్టుకు తొలి టైటిల్ అందించాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అదరగొట్టి.. ఏకంగా టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించున్నాడు.
టీమిండియా సెలక్టర్ల నమ్మకాన్ని నిజం చేస్తూ.. తాజాగా దేశీ వన్డే విజయ్ హజారే వన్డే టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లోనూ ఇషాన్ కిషన్ (Ishan Kishan) సెంచరీతో కదంతొక్కాడు. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కర్ణాటక (Karnataka vs Jharkhand)తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఇషాన్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 14 సిక్స్‌ల సాయంతో 125 పరుగులు చేశాడు.
ఇషాన్ కిషన్ వరల్డ్ రికార్డు
ఈ క్రమంలో అతడు 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లో భారత్ తరఫున రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అదే విధంగా ఓ ప్రపంచ రికార్డును కూడా ఇషాన్ కిషన్ ఈ సందర్భంగా తన ఖాతాలో వేసుకున్నాడు.
లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. గతంలో శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ సందున్ వీరక్కడి 39 బంతుల్లో శతక్కొట్టగా.. తాజాగా ఈ రికార్డును ఇషాన్ సవరించాడు. తద్వారా ప్రపంచంలోనే లిస్ట్-ఎ క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా నిలిచాడు.
లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్లు
👉ఇషాన్ కిషన్- 33 బంతుల్లో- 2025లో జార్ఖండ్ తరఫున కర్ణాటక మీద
👉సందున్ వీరక్కడి- 39 బంతుల్లో- 2019లో సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున బదురేలియా స్పోర్ట్స్ క్లబ్ మీద
👉ఉర్విల్ పటేల్- 41 బంతుల్లో- 2023లో గుజరాత్ తరఫున అరుణాచల్ ప్రదేశ్ మీద
👉మార్క్ బౌచర్- 44 బంతుల్లో- 2006లో సౌతాఫ్రికా తరఫున జింబాబ్వే మీద.
ఇషాన్ దంచి కొట్టినా
ఇదిలా ఉంటే.. కర్ణాటకతో మ్యాచ్‌లో ఇషాన్ దంచి కొట్టినా ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ పరాజయం పాలైంది. డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక 5 వికెట్ల తేడాతో జార్ఖండ్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 412 పరుగులు చేసింది.
విరాట్ సింగ్ (68 బంతుల్లో 88; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుమార్ కుషాగ్ర (47 బంతుల్లో 63; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకున్నారు. కర్ణాటక బౌలర్లు ఏకంగా 47 ఎక్స్‌ట్రాలు సమర్పించుకోవడంతో జార్ఖండ్ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. అభిలాష్ శెట్టి 4 వికెట్లు పడగొట్టాడు.
పడిక్కల్ భారీ సెంచరీతో
అనంతరం లక్ష్యఛేదనలో కర్ణాటక 47.3 ఓవర్లలో 5 వికెట్లకు 413 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దేవదత్ పడిక్కల్ (118 బంతుల్లో 147; 10 ఫోర్లు, 7 సిక్స్‌లు) భారీ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (34 బంతుల్లో 54; 10 ఫోర్లు), అభినవ్ మనోహర్ (32 బంతుల్లో 56 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలు సాధించగా... ధ్రువ్ ప్రభాకర్ (22 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), క్రిష్ణన్ శ్రీజిత్ (38), కరుణ్ నాయర్ (29), రవిచంద్రన్ స్మరణ్ (27) తలా కొన్ని పరుగులు చేశారు. జార్ఖండ్ బౌలర్లలో సౌరభ్ శేఖర్, ఉత్కర్ష్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.


