సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 విజేతగా జార్ఖండ్ నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో హర్యానాను 69 పరుగుల తేడాతో చిత్తు చేసిన జార్ఖండ్.. తొలిసారి ఈ దేశవాళీ టీ20 టోర్నీ టైటిల్‌ను ముద్దాడింది. జార్ఖండ్ ఛాంపియన్‌గా నిలవడంలో ఆ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్‌ది కీలక పాత్ర.
తుది పోరులో కిషన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కిషన్ ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. ఎంసీఎ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో అతడు కేవలం 45 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఓవరాల్‌గా 49 బంతులు ఎదుర్కొన్న కిషన్.. 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు కుషాగ్ర(81) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో జార్ఖండ్ 6 వికెట్ల నష్టానికి ఏకంగా 262 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో హర్యానా 18.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో సత్తాచాటిన కిషన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
కిషన్ సాధించిన రికార్డులు ఇవే..
👉సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన మొట్టమొదటి కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ రికార్డు సృష్టించాడు.
👉ఒకే టీ20 టోర్నమెంట్‌లో (అంతర్జాతీయ లేదా డొమెస్టిక్) అత్యధిక సిక్సర్లు బాదిన వికెట్ కీపర్ కెప్టెన్‌గా ఇషాన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో అతడు 33 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు ఎంఎస్ ధోని (30), నికోలస్ పూరన్ (30) పేరిట ఉండేది.
👉టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్(5) రికార్డును ఇషాన్ బ్రేక్ చేశాడు. కిషన్ ఇప్పటివరకు టీ20ల్లో 6 సెంచరీలు చేశాడు. ఓవరాల్ వరల్డ్ క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన రెండో వికెట్ కీపర్‌గా కిషన్ నిలిచాడు. తొలి స్ధానంలో క్వింటన్ డికాక్(7) ఉన్నాడు.
👉సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డును ఇషాన్ సమం చేశారు. ఈ దేశవాళీ టోర్నీలో వీరిద్దరూ ఇప్పటివరకు చెరో ఐదు సెంచరీలు నమోదు చేశాడు.
👉ఒకే టోర్నమెంట్‌లో వికెట్ కీపర్ కెప్టెన్‌గా రెండు సార్లు సెంచరీలు సాధించిన మొదటి ప్లేయర్‌గా ఇషన్ నిలిచాడు.
కిషన్ చివరగా 2023లో భారత్ తరపున ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో ఆడాలన్న తమ ఆదేశాలను ధిక్కరించడంతో బీసీసీఐ అతడిని సెంట్రల్ కాంట్రాక్ నుంచి తప్పించింది. ఆ తర్వాత మళ్లీ అతడు డొమాస్టిక్ క్రికెట్ ఆడడంతో తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. కానీ జట్టులోకి మాత్రం ఇంకా పునరాగమనం చేయలేదు.
చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'


