మచ్చ'లిక' మాయం | Helath Tips: Vitiligo: Diagnosis and treatment | Sakshi
Sakshi News home page

Vitiligo: మచ్చ'లిక' మాయం

Nov 16 2025 1:52 PM | Updated on Nov 16 2025 2:38 PM

Helath Tips: Vitiligo: Diagnosis and treatment

ఒంటిపైన తెల్లటి మచ్చలతో కనిపించే బొల్లి వల్ల ప్రాణహాని ఉండదు. కానీ ఒంటిపై తెల్లటి పొడలు మచ్చలు మచ్చలుగా కనిపిస్తుండటం వల్ల బాధితులు నలుగురిలోకి రావడానికి సామాజికంగా ఇబ్బంది పడతారు. అది అంటువ్యాధి కాదని తెలియక చాలామంది వాళ్ల పట్ల వివక్ష చూపుతారు. ఒక రకంగా చూస్తే మన సొంత వ్యాధి నిరోధకత (ఇమ్యూనిటీ) అన్నది మన సొంతకణాలపైనే దాడి చేసే ఆటో ఇమ్యూన్‌ సమస్య కూడా ఒక అంశం కావడంతో ఒకప్పుడు దీనికి అంతగా చికిత్స ఉండేది కాదు. అయితే ఇటీవల దీనికి మంచి మంచి చికిత్స ప్రక్రియలే అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లిష్‌లో విటిలిగో అని పిలిచే ఈ బొల్లి వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం.

ప్రాణహాని కలిగించకపోయినా వివక్షకు కారణమయ్యే ఈ వ్యాధి విస్తృతి మన జనాభాలోని దాదాపు 0.5 శాతం మందిలో కనిపిస్తోంది. ఇటీవల దీని విస్తృతి పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. 
మచ్చలు... పాటర్న్స్‌ బట్టి వాటిల్లో రకాలు...  

ఈ బొల్లి మచ్చలు రకరకాల పాటర్న్స్‌లో కనిపిస్తాయి. ఉదాహరణకు కొందరిలో ఈ తెల్లమచ్చలు కొద్దిపాటి  పొడల్లాగా వస్తాయి. అయితే వాటి సైజు పెరగదు. ఎప్పటికీ అవి చిన్నవిగానే కనిపిస్తుంటాయి. మరికొందరిలో మాత్రం ఇవి పెద్దవిగా విస్తరిస్తూ ఒక తెల్లమచ్చతో మరొకటి కలిసివపోడం వల్ల శరీరమంతా తెల్లబారి΄ోతుంది. ఆ పాటర్న్స్‌ కనిపించే తీరును బట్టి వీటిని మూడు రకాలుగా వర్ణించవచ్చు. 

ఫోకల్‌ పాటర్న్‌... ఈ తెల్లని మచ్చలు చర్మంలో ఏదో ఒకచోటికి మాత్రమే పరిమితం అవుతాయి.

సెగ్మెంటల్‌ పాటర్న్‌... ఈ మచ్చలు శరీరమంతటా కాకుండా ఏదో ఒక వైపునకే... అంటే ముందువైపునకుగానీ లేదా వెనకవైపునకే పరిమితం కావడం. 

జనరలైజ్‌డ్‌ పాటర్న్‌... ఒక చోటికి మాత్రమే పరిమితం కాకుండా చర్మంపై అనేక ప్రాంతాలకు విస్తరించడం. అలాగే ఏదో ఒక వైపునకు మాత్రమే ఉండకుండా శరీరమంతటా కనిపించడం. 

ఈ తెల్లటి మచ్చలు సాధారణంగా చేతులు, వేళ్ల చివరలు, పాదాలు, భుజాలు, ముఖం, పెదవులు లాంటి చోట్ల ఎక్కువగా ఉంటాయి. కొందరిలో బాహుమూలాలు, పొత్తికడుపు కింది భాగం, నోటి చుట్టూ, కంటి చుట్టూ, మర్మావయవాల ప్రాంతంలో ఉంటాయి. ఈ మచ్చలకు తోడు... విటిలిగో ఉన్నవారిలో ఆ తెల్ల మచ్చలు విస్తరించిన ప్రాంతంలో ఉండే వెంట్రుకలు (ఉదాహరణకు మాడు, కనురెప్పలు, కనుబొమలు, గడ్డంలోని ప్రాంతాల్లోనివి) తెల్లగా మారిపోతాయి. నల్లటి మేనిఛాయ ఉండే వారిలో ఈ తెల్లమచ్చలు / రంగు కోల్పోయిన ప్రాంతాలు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. 

అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియలు... 
శరీరంపై ఉండే ఆ మచ్చల పరిమాణం, అవి వచ్చిన చోటు, అక్కడ అవి ఎంతమేర విస్తరించాయి... లాంటి అనేక అంశాలపై చికిత్స ఆధారపడి ఉంటుంది. అలాగే చికిత్స ప్రక్రియలు కూడా వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటాయి. ఇక చికిత్సా ఫలితాలు  కూడా ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటాయి. కొందరిలో ఫలితం చాలా వేగంగా కనిపిస్తే, మరికొందరిలో చాలా ఆలస్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియలివి... 

మెలనిన్‌ కణాలు మరింత నాశనం కాకుండా చూడటం : ఈ ప్రక్రియలో చర్మానికి రంగును ఇచ్చే మెలనిన్‌ కణాలు మరింతగా నాశనమై΄ోకుండా చేస్తారు. అంతేకాదు... రంగు కోల్పోయిన శరీర భాగానికి మునుపటి రంగు వచ్చేలా చేస్తారు. 

స్టెరాయిడ్‌ క్రీములు : కొన్ని రకాల స్టెరాయిడ్‌ క్రీముల్ని పైపూతగా (టాపికల్‌ మెడిసిన్స్‌గా) వాడాల్సి ఉంటుంది. అవి చర్మానికి సాధారణ రంగు వచ్చేలా చేయడంతో పాటు మచ్చలు మరింత విస్తరించకుండా సహాయపడతాయి. అయితే అవి స్టెరాయిడ్స్‌ అయినందున వచ్చే సైడ్‌ ఎఫెక్ట్స్‌ను దృష్టిలో పెట్టుకుని వాటిని కచ్చితంగా డాక్టర్‌ పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. లేదంటే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. 

ఫొటో థెరపీ : ట్యాబ్లెట్లు, లోషన్‌ రూపంలోని సోరాలెన్స్‌ అనేవి ఈ తరహా చికిత్సలో ఉపయోగపడతాయి. అయితే ఈ ట్యాబ్లెట్‌లు లేదా క్రీములను సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్‌ అవుతూ వాడాలి. అయితే సూర్మరశ్మికి బదులుగా హానికరం కాని మోతాదులో అల్ట్రావయొలెట్‌ కిరణాలకు ఎక్స్‌΄ోజ్‌ అయ్యేలా కూడా చేయవచ్చు. 

దీన్ని ‘పూవా’ థెరపీ అంటారు. మరికొంతమందికి న్యారో బ్యాండ్‌ అల్ట్రా వయొలెట్‌ – బి కిరణాలతోనూ, ఎక్సైమర్‌ లేజర్‌ అనే ఫొటో థెరపీ ప్రత్యామ్నాయాలూ అందుబాటులో ఉన్నాయి. ఈ ఎక్సైమర్‌ లేజర్‌ను కొన్ని నిర్దిష్టమైన ప్యాచ్‌ల దగ్గరే ఉపయోగించడాని వీలుంది. 

ఈ ఫొటో థెరపీ ప్రక్రియల కోసం హాస్పిటల్‌కు రాలేని వారికి ఇంట్లోనే ఉపయోగించుకునేలా హోమ్‌ బేస్‌డ్‌ ఫొటో థెరపీ పరికరాలూ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వీటిని డాక్టర్‌ చెప్పిన విధంగా మాత్రమే వాడాల్సి ఉంటుంది. 

డి–పిగ్మెంటేషన్‌ ట్రీట్‌మెంట్‌ : కొంతమందిలో దాదాపు 80 శాతం పైగా శరీరం తెల్లబడిపోతుంది. ఇలాంటివారిలో నల్లగా ఉన్న మిగతా ప్రాంతాన్ని కూడా తెల్లగా చేస్తారు. 

ఇతర ప్రక్రియలు : జింక్‌గో బైలోబా, లీవామీసోల్‌... లాంటివి ఇమ్యూన్‌ మాడ్యులేటర్స్‌. అంటే ఇవి బాధితుల్లో ఇమ్యూనిటీని పెంచడం ద్వారా విటిలిగోతో పోరాడతాయి. ఇవి టాబ్లెట్ల రూపంలోనూ లభ్యమవుతాయి. 

శస్త్రచికిత్స (సర్జికల్‌ ట్రీట్‌మెంట్‌): వీటిల్లో పంచ్‌ గ్రాఫ్టింగ్, స్ప్లింట్‌ స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ వంటి రకరకాల సర్జరీ ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆధునిక శస్త్రచికిత్స ద్వారా చర్మంపై ఇతరచోట్లలో ఉన్న రంగునిచ్చే పిగ్మెంట్‌ కణాలను (మెలనోసైట్స్‌ను)... అవి కోల్పోయిన ప్రాంతంల్లోకి బదిలీ చేసేందుకు అవకాశం ఉంది. 

అయితే ఇతరత్రా సాధారణ చికిత్సల వల్ల ఎలాంటి ఫలితాలూ రాని సందర్భాల్లో మాత్రమే ఈ శస్త్రచికిత్స పద్ధతిని అవలంబిస్తారు. శరీరంలోని కొన్ని భాగాల్లో (అంటే... పెదవులు, చేతుల వేళ్ల చివరి భాగాలు, కాళ్ల చివరన ఉండే భాగాలకు) వచ్చిన మచ్చల విషయంలో సాధారణ చికిత్స ప్రక్రియలు అంతగా సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఈ శస్త్రచికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. 

అయితే పక్కలకు విస్తరించని విటిలిగో మచ్చలతో బాధపడే పేషెంట్ల విషయంలోనే ఈ శస్త్రచికిత్స విధానాన్ని ఆలోచిస్తారు. వ్యాప్తి చెందక΄ోవడం అంటే... ఒక ఏడాది వ్యవధిలో మచ్చ సైజు విస్తరించక΄ోవడం, కొత్త ప్రాంతాల్లో మచ్చలు రాకపోవడాన్ని మచ్చలు వ్యాప్తిచెందని పేషంట్లుగా పరిగణిస్తారు. ఈ సర్జికల్‌ ప్రక్రియలో ఇతర చోట్ల నుంచి చర్మాన్ని తీసుకుని గ్రాఫ్ట్‌ చేస్తారు. 

ఇప్పుడు అభివృద్ధి చెందిన ఆధునిక శాస్త్రవిజ్ఞాన ప్రక్రియల వల్ల మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంది. సర్జరీ తర్వాత మళ్లీ అక్కడ సాధారణ పిగ్మెంట్‌ వచ్చేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చు. అయితే ఒక్కోసారి అనుకున్న ఫలితాలు వచ్చేందుకుగాను... సర్జరీ తర్వాత సాధారణ వైద్యచికిత్స కూడా అవసరం కావచ్చు. 

చివరగా... ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్స ప్రక్రియల వల్ల విటిలిగో రోగులు మునుపటిలా ఆత్మన్యూనతకు గురికావాల్సిన అవసరంగాని, బాధపడాల్సిన పరిస్థితిగాని లేదు. అనేక వినూత్న చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చినందున వాటి సాయంతో మళ్లీ మేని రంగును మామూలుగా మార్చుకునేందుకు చాలా అవకాశాలున్నాయి.  

బొల్లి వ్యాధి కారణాలు ఏమిటంటే... 
మానవ చర్మంలోని మెలనోసైట్స్‌ అనే కణాల్లో రంగును ఇచ్చే పిగ్మెంట్‌ను కలిగి ఉంటాయి. ఈ రంగునిచ్చే పిగ్మెంట్‌ వల్లనే పదార్థం వల్ల మేనికి రంగు సమకూరుతుంది. ఉదాహరణకు ఒకరి చర్మంలో మెలనోసైట్స్‌లో పిగ్మెంట్‌ మోతాదులు ఎక్కువగా ఉంటే వాళ్ల చర్మం నలుపు మొదలుకొని, తక్కువగా ఉన్నవారి చర్మం తెల్ల రంగు (ఫెయిర్‌) వరకు రకరకాల షేడ్స్‌లో మేని రంగు ఉంటుంది. ఈ మెలనోసైట్స్‌ అన్నీ ఒకేచోట కుప్పగా ఉన్నప్పుడు అక్కడ నల్లటిరంగు పుట్టుమచ్చ వస్తుంది. 

ఏదైనా కారణాల వల్ల ఒకరి చర్మంలో ఈ మెలనోసైట్స్‌ దెబ్బతినడం వల్ల అక్కడి పిగ్మెంట్‌ లోపించినప్పుడు అక్కడి చర్మం తన సహజమైన రంగును కోల్పోయి తెల్లగా కనిపిస్తుంది. ఇలా చర్మపు రంగు లోపించడానికి... రంగును ఇచ్చే పదార్థమైన పిగ్మెంట్‌లోని కణాలను సొంత వ్యాధి నిరోధకత దెబ్బతీయడం (ఆటోఇమ్యూన్‌ అంశం) కూడా ఒక కారణం కావచ్చు.

ఈ వ్యాధిగ్రస్తుల్లోని చాలామందిలో ఇది జన్యుపరంగా వచ్చే అవకాశాలెక్కువ. ఇక మరికొందరిలో ఏ కారణమూ లేకుండానే ఇది కనిపించవచ్చు. కారణం ఏదైనా బొల్లి వచ్చిన వారిలో శరీరంపై తెల్లటి మచ్చలు ప్యాచులు ప్యాచులుగా కనిపిస్తాయి. ఇంగ్లిష్‌లో దీన్ని విటిలిగో అని పిలుస్తారు. వైద్య పరిభాషలో దీన్ని ‘ల్యూకోడెర్మా’  అంటారు.

ఈ మచ్చలు హాని కలిగించవు కానీ... 
ఈ విటిలిగో మచ్చల్లో ఎలాంటి నొప్పీ ఉండదు. వీటి కారణంగా ఆరోగ్యానికి సైతం హాని కూడా ఏదీ ఉండదు. కానీ చూడటానికి (లుక్స్‌ పరంగా) ఇది ఏమాత్రం బాగుండదు. కాబట్టి ఎంతగా హానికరం కాక΄ోయినప్పటికీ ఈ వ్యాధి కారణంగా బాధితులు వివక్షకు ఆత్మన్యూనతకూ లోనయ్యే అవకాశాలూ ఎక్కువే.

డాక్టర్‌   స్వప్నప్రియ, సీనియర్‌ డర్మటాలజిస్ట్‌  

(చదవండి: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం పొడిబారిపోతోందా..?)


డా‘‘  స్వప్నప్రియ, 
సీనియర్‌ డర్మటాలజిస్ట్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement