'ఏంటీ ఇంత రెంటా' అని అవాక్కయ్యారా?. అవును మీరు చదివింది నిజమే. సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ ఒక్క నెల కిరాయి అక్షరాలా 8 లక్షల రూపాయలు. మామూలుగా సిటీలో సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ నెల అద్దె 10 వేల రూపాయల వరకు ఉండొచ్చు. ప్రైమ్ ఏరియా అయితే ఇంకాస్త ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. మరీ 8 లక్షలంటే చాలా చాలా ఎక్కువ కదా! ఈ వార్త గురించి తెలిసిన వారంతా ఇలాగే ఫీలవుతున్నారు. ఇంతకీ ఈ సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ ఎక్కడనేగా మీ డౌటు? ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం రండి.
దీపాంషి చౌదరి అనే మహిళ షేర్ చేసిన 1 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ (1BHK Flat) హోం టూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral) అయింది. అన్ని సదుపాయాలతో కూడిన సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్‌ను ఆమె తన వీడియోలో చూపింది. లాబీ, లివింగ్‌రూం, వాష్‌రూం, బెడ్‌రూం, కిచెన్‌తో చూడటానికి ఫ్లాట్ మామూలుగానే ఉంది. కానీ ఏకంగా 8 లక్షలు అద్దె అంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే అపార్ట్‌మెంట్ ఉన్న ఏరియాను బట్టి చూస్తే అంత అద్దె కరెక్ట్ అంటున్నారు దీపాంషి చౌదరి.
తాను చూపించిన ఫ్లాట్ సెంట్రల్ లండన్‌లో (Central London) ఉందని ఆమె వెల్లడించారు. ఈ ఫ్లాట్‌లోంచి ప్రఖ్యాత సెయింట్ పాల్స్ కేథడ్రల్ చర్చిని ప్రత్యక్షంగా చూడొచ్చని చెప్పారు. క్రిస్మస్ సీజన్‌లో నెల రోజులకు మాత్రమే బుక్ చేసుకున్నందున అద్దె ఎక్కువ అని వివరించారు. “అవును, అద్దె చాలా ఎక్కువగా ఉంది. కానీ లోకేషన్‌ను బట్టి చూస్తే కిరాయి విలువ కరెక్టేనని అనిపిస్తుందని అన్నారామె. ఈ వీడియో చూసిన వారంతా “ఇది చాలా ఎక్కువ” అంటున్నారు. “లండన్‌లో చాలా మంది ఇంత అద్దె భరించలేరు. ఇంత ఖరీదైన ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారంటే.. మీరు ఏం ఉద్యోగం చేస్తార”ని ఒక నెటిజన్ ప్రశ్నించారు.
చదవండి: మనకు 2026.. వారికి 2018!
హాంప్‌స్టెడ్ వంటి ప్రాంతాల్లో రెండంతస్తుల ఇళ్లు నెలకు 2 నుంచి 3 వేల ఫౌండ్ల (సుమారు 3 లక్షలు) కిరాయికి అందుబాటులో ఉన్నాయని కొంతమంది తెలిపారు. లండన్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లు 4 నుంచి 5 వేల ఫౌండ్ల అద్దెకు దొరుకుతాయని కూడా వెల్లడించారు. తాను ఉంటున్నత్రిబుల్ బెడ్‌రూమ్‌ల ఫ్లాట్‌కు నెలకు 3,200 ఫౌండ్లు చెల్లిస్తామని లండన్‌లోని కానరీ వార్ఫ్‌లో ప్రాంతంలో ఉంటున్న నెటిజన్ ఒకరు తెలిపారు. సెయింట్ పాల్స్ కేథడ్రల్ సెంట్రల్ లైన్‌కు కేవలం 10-15 నిమిషాల దూరంలో ఈ ఫ్లాట్ ఉందన్నారు.


