
మా కూతురికి పెళ్లి చేసి ఐదేళ్లవుతోంది. పెళ్లి చేసేటప్పుడు కట్నం కింద ఎకరా భూమి – ఒక ఇల్లు ఇచ్చాము. గిఫ్ట్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ కూడా చేశాము. ఇదేకాకుండా మా అమ్మాయి సొంత సంపాదన అయిన మరొక ఇంటి స్థలం కూడా ఉంది. మా అమ్మాయికి సంతానం లేరు. అయితే దురదృష్టవశాత్తూ మా కూతురు – అల్లుడు ఇటీవలే ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు తన సొంతగా సంపాదించుకున్న భూమితోపాటు మేము ఇచ్చిన భూమి, ఇల్లు కూడా తిరిగి ఇచ్చేది లేదు అంటూ మా అల్లుడు గారి తల్లి – అక్క పేచీ పెడుతున్నారు. ఒక లాయర్‌ను సంప్రదించగా హిందూ వారసత్వ చట్టం ప్రకారం మాకు ఏమీ రాదు అని చెబుతున్నారు. అది నిజమేనా?
– రామ సుధ, సూర్యాపేట
హిందూ వారసత్వ చట్టం, 1956 లోని సెక్షన్ 14 ప్రకారం ఒక హిందూ మహిళ వారసత్వం ద్వారా, వీలునామా ద్వారా, విభజన ద్వారా, మెయింటెనెన్స్‌లో (బకాయిలతో కలిపి) భాగంగా, మరొక వ్యక్తి నుంచి బహుమతిగా/గిఫ్ట్ ద్వారా ఆమె వివాహానికి ముందు, వివాహ సమయంలో లేదా వివాహం తరువాత, మరే ఇతర విధంగా సంక్రమించినప్పటికీ, స్వార్జితం ద్వారా లేదా ‘స్త్రీ ధనం’ రూపేణా వచ్చినప్పటికీ, అది ఆమె పూర్తి హక్కులు కలిగిన సొంత ఆస్తిగా పరిగణించబడుతుంది.
అంతేకాకుండా ఇదే చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం వీలునామా రాయకుండా మరణించిన హిందూ మహిళ ఆస్తి ఈ కింది పేర్కొన్న వారికి (వారసత్వంగా) క్రమ పద్ధతిలో చెందుతుంది: అంటే మొదటి క్రమంలో ఉన్నవారు ఉంటే కేవలం వారికి మాత్రమే చెందుతుంది. వారు లేని పక్షంలో రెండవ నిబంధనలో చూపించిన వారికి, వారు లేకపోతే మూడవ వారికి, అలా ఎవరూ లేకపోతే ఆఖరున చూపిన వారికి చెందుతుంది.
1) మొదటగా: కొడుకులకు, కూతుళ్లకు
(కొడుకు కూతురు మరణించి ఉంటే వారి సంతానానికి) – భర్తకు
2) రెండు: భర్త వారసులకు
3) మూడు: తల్లికి– తండ్రికి
4) నాలుగు: తండ్రి వారసులకు
5) ఆఖరున: తల్లి వారసులకు
ఇక మీ విషయానికి వస్తే, మీ అమ్మాయికి మీరు ఇచ్చింది గిఫ్ట్ డీడ్ అని చెప్పారు. అది వరకట్నంగా ఇప్పుడు రుజువు చేయటం సాధ్యపడకపోవచ్చు. ఈ లావాదేవిని స్త్రీ ధనం లాగానే పరిగణిస్తారు. ఒకవేళ మీరు సంపాదించి తనకి ఇచ్చినప్పటికీ ఆ ఆస్తి మీ కూతురి స్వంత ఆస్తి అయిపోయింది. మీ అల్లుడిగారి తల్లి – అక్క కూడా బతికే ఉన్నారు కాబట్టి, పైన చూపిన విధంగా తన భర్త వారసులైన వారికే మీ అమ్మాయి ఆస్తి చెందుతుంది.
ఇటీవలే సుప్రీంకోర్టు కూడా ఇలాంటి ఒక కేసు పరిష్కరించే క్రమంలో ‘‘ఒక హిందూ మహిళకి పెళ్లి అయిన తర్వాత తన గోత్రం మారుతుంది. దానితో తన ఆస్తులు కూడా భర్తకి చెందుతాయి కానీ ఆమె తల్లిదండ్రులకు కాదు’’ అని పేర్కొంది.
మీ అమ్మాయి భర్త, భర్త వారసులు లేని పక్షంలో మాత్రమే మీకు తన ఆస్తి వచ్చే అవకాశం ఉంది. అయితే మీ అమ్మాయికి ఇచ్చిన ఆస్తి ఒకవేళ తనకి వారసత్వంగా చెందినది అయితే మాత్రం, ఆ వారసత్వ మూలానికి తిరిగి వెళ్ళిపోతుంది. మీ వద్ద ఉన్న పత్రాలను తీసుకుని ఒకసారి లాయరు గారిని కలవండి. మీ కేసులో మీ పక్షాన ఏదైనా వీలు ఉంటే చూసి చెప్పవచ్చు.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com కుమెయిల్ చేయవచ్చు. )
(చదవండి: క్యూట్ క్యాట్..ఒత్తిడి సెట్..! దేశంలోనే ప్రప్రథమం..)