
ఫిజియోథెరపీ.. లాఫింగ్ థెరపీ.. ఫిష్ థెరపీ గురించి వినే ఉంటారు.. కానీ ‘క్యాట్ థెరపీ’ గురించి ఎప్పుడైనా విన్నారా..!? ఔను ప్రస్తుతం హైదరాబాద్ నగరవాసులు వినడమే కాదు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఆ క్యాట్ థెరపీని ఆస్వాదించనున్నారు. ఉరుకులు పరుగుల నగర జీవితం.. తీవ్ర ఒత్తిళ్లతో అలసిపోయిన మనసుకు కాసేపు మానసిక ప్రశాంతత కోరుకోని వారెవరూ ఉండరంటే అతశయోక్తి కాదేమో? అయితే మానసిక ప్రశాంతతకు పెంపుడు జంతువుల మధ్య గడపడం ఓ చక్కని పరిష్కారమని, ఎటువంటి మందులూ నయం చేయలేని నిరాశ నిస్పృహలు, ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలను జంతువులు దూరం చేస్తాయని చెబుతున్నారు నిపుణులు.
క్యాట్ థెరపీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సులభమైన మార్గమని, దీనికోసం యజమానులు తమ పిల్లులకు శిక్షణ ఇచ్చి, పెట్ పార్ట్‌నర్స్ వంటి సంస్థల ద్వారా సేవలను అందిస్తారు. ఎన్నో జీవన వైవిధ్యాలకు వేదికైన మన నగరంలో క్యాట్ థెరపీలు సైతం హాయ్ చెప్పడం ఇక్కడి జీవనశైలికి నిదర్శనంగా నిలుస్తోంది.
హైదరాబాద్‌లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇదే ఏడాది ప్రాయణీకుల ఒత్తిడిని తగ్గించేందుకు డాగ్ థెరపీ పేరుతో ప్యాసింజర్స్ లాంజ్‌లో క్యూట్ క్యూట్ పప్పీస్‌ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ప్రస్తుతం నగరంలో క్యాట్ థెరపీని అందుబాటులోకి తెస్తున్నారు క్యాట్స్ కంట్రీ నిర్వాహకులు.
మానసిక సమస్యలకు జంతువుల థెరపీ చక్కని పరిష్కారమని పలు అధ్యయనాలు సైతం వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే వివిధ దేశాల్లో వినూత్నంగా క్యాట్ థెరపీ కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. మానసిక ప్రశాంతతకు దోహదం చేసే ఈ క్యాట్ థెరపీ కేంద్రాలు దేశంలో మొట్టమొదటి సెంటర్ హైదరాబాద్‌లో ఆవిష్కృతం కావడం విశేషం.
క్యాట్స్ కంట్రీ.. దేశంలో ప్రథమం..
ఇప్పటివరకూ యుఎస్, జపాన్, కెనడా, థాయిలాండ్, ఇండోనేషియాలకే పరిమితమైన క్యాట్ థెరపీ సేవలు దేశంలో మొట్టమొదటిసారి హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చాయి. కుతుబ్‌షాహీ 7 టూమ్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఇటీవల్లే అంతర్జాతీయ పిల్లుల దినోత్సవం (ఇంటర్నేషనల్ క్యాట్స్ డే–ఆగస్టు–8) రోజున ప్రారంభమైంది.
కుక్కలు, పిల్లులు లాంటి పెంపుడు జంతువుల మధ్య గడపడం, వాటితో ఆడుకోవడం ఎంతో సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తీవ్ర ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడే వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది. అంతర్జాతీయంగా ప్రముఖ అధ్యయన సంస్థలు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.
50 రకాలకుపైగా పిల్లులు..
ప్రస్తుతం ఉరుకులు పరుగులతో కూడిన నగర జీవితంలో.. తమతో పాటు పెంపుడు జంతువులను పెంచుకునే వెసులుబాటు తక్కువే. అలాంటి వారు ఈ కేంద్రంలో సేవలు పొందవచ్చు. ఇక్కడ 50కి పైగా పర్షియన్ జాతికి చెందిన పిల్లులు ఉన్నాయి. ఇవన్నీ మానవులతో స్నేహంగా మెలుగుతాయి. మీతో ఆడుకుంటాయి.. గారాబం చేస్తాయి. వీటి మధ్య గడిపి నూతనోత్తేజాన్ని పొందవచ్చు. దీనినే క్యాట్ థెరపీ అంటారు.
ఇవన్నీ వ్యాక్సినేషన్ చేసిన ఆరోగ్యవంతమైన పిల్లలు. కాబట్టి వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక గంటకు అత్యధికంగా ఐదుగురికి మాత్రమే ప్రవేశం ఉండే ఈ సెంటర్‌లోకి వెళ్లాలంటే అధికారిక వెబ్‌సైట్‌లో ముందుగా.. స్లాట్ బుక్ చేసుకోవాలి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.. స్లాట్ బుక్ చేసి ఈ కేంద్రాన్ని ఎప్పుడైనా సందర్శించవచ్చు.
వృత్తిలో సంతృప్తితో.. వినూత్నంగా..
స్వార్థపరుల ప్రపంచంలో నుంచి.. నిస్వార్థ జంతువుల ప్రపంచంలోకి రండి. కాసేపు మా ఆత్మీయమైన పిల్లులతో గడపండి. వయసును మర్చిపోయి కాసేపు బాల్యంలోకి వెళ్లండి. మిమ్మల్ని నిస్వార్థంగా ప్రేమించేందుకు, అలసిపోయిన మనసుకు కాస్త ప్రశాంతత కలిగించేందుకు, ఆటలు ఆడుకునేందుకు మా పిల్లులు సిద్ధంగా ఉన్నాయి.
35 సంవత్సరాల పాటు పశు సంవర్ధక శాఖలో వైద్యుడిగా పని చేసిన అనుభవంతో.. ఉద్యోగ విరమణ అనంతరం దీనిని ప్రారంభించాను. జంతువులతో మమేకమైన మనసు వాటితోనే సహవాసం, ఆతీ్మయతను కోరుకుంటోంది అనడానికి నా ప్రయాణం ఒక ఉదాహరణ. మా వెబ్‌సైట్ www. CatsCountry. in లో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.
– ముహమ్మద్ యాకుబ్ షరీఫ్, క్యాట్స్ కంట్రీ వ్యవస్థాపకులు
(చదవండి: ఇదేం పేరెంటింగ్..! వామ్మో ఈ రేంజ్‌లో డేరింగ్ పాఠాలా..? తిట్టిపోస్తున్న నెటిజన్లు)