
దీపావళి వేడుకలతో రాత్రంతా ఆహ్లాదంగా ఆడిపాడి గడుపుతారు అందరు. ముఖ్యంగా ఈ వేడుక పుణ్యామా అని రకరకాల స్వీట్లు, విందులతో పొట్టపగిలేలా ఆరగించేస్తాం. మరోవైపు బంధు మిత్రులతో కలిసి టపాసులు కాల్చి..ఆడిపాడి ఎప్పుడో పడుకుంటాం. పొద్దున లేచాక..ఏదో నిద్ర లేనట్లుగా పొట్టంతా ఉబ్బరంగా, ఒకటే తలనొప్పిగా భారంగా ఉంటుంది. శరీరమంతా ఏదో తెలియని బరువులా ఇబ్బందిగా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే పండుగ హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడుతుంటాం. నార్మల్ స్థితికి వచ్చి యథావిధిగా యాక్టివ్‌గా ఉండాలంటే ఈ నేచురల్ పానీయమే మేలంటున్నారు నిపుణులు. దీపావళి తర్వాత ఉత్సాహంగా ఉండటానికి ఇది అల్టిమేట్ రికవరీ పానీయంగా చెబుతున్నారు. మరి అదెంటో చూసేద్దామా..!.
హ్యాంగోవర్ ఎందుకు వస్తుందంటే..
దీపావలి పండుగ పేరుతో అతిగా తిని, బాగా ఎంజాయ్ చేస్తాం. పైగా శరీరం అలిసిపోతున్న బంధు మిత్రులను చూసి ఎక్కడలేని ఉత్సాహాన్ని కొనితెచ్చుకుంటాం. దాంతో మరుసటి రోజు డీహైడ్రేషన్‌కి గురయ్యే నీరసంతో విలవిలాడుతుంటాం.
దీన్నే దీపావళి హ్యాంగోవర్ లేదా పండుగ హ్యాంగోవర్ అంటారు. దీన్నుంచి తక్షణమే రీలిఫ్ ఇచ్చే అద్భుత పానీయం నిమ్మ కొబ్బరి నీరు అని చెబుతున్నారు నిపుణులు. ఇది సహజసిద్ధమైన డిటాక్స్‌లా పనిచేస్తుందట.
ఏవిధంగా అంటే..
రీహైడ్రేట్ చేసి శరీరాన్ని యాక్టివ్ చేస్తుందట. అలాగే కొబ్బరి నీరులో 94% నీరు, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. దీనికి నిమ్మకాయను జోడించడంతో రుచిపెరగడమే కాకుండా ఖనిజ శోషణ కూడా మెరుగుపడుతుందట. ముఖ్యంగా పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ప్రేగుకి ఉపశమనం అందించి, జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. కొబ్బరినీళ్లల్లో ఉండే మెగ్నీషియం జీర్ణకండరాలను సడలించి.. ఆమ్లత్వం, మలబద్ధకం, అసౌకర్యాన్ని నివారిస్తుంది.
అలాగే జలుబు, అలసట వంటి వాటిని నివారిస్తుంది. నిమ్మకాయలో ఉండే సీ విటమిన్ రోగనిరోధక శక్తిని అందించి..యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్ వంటి వాటిని అందించి శరీరం తక్షణమే కోలుకునేలా చేస్తుంది.
వేయించి పదార్థాలు తీసుకోవడం వల్ల వచ్చే పేగువాపుని తగ్గిస్తుందట. ఆక్సీకరణ ఒత్తిడిని దూరం చూస్తుందట.
దీంతోపాటు చర్మాన్ని గ్లో అప్ చేసి, హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుందట. ఈ నిమ్మకాయ కొల్లాజెన్ ఉత్పత్తికి హెల్ప్ అవుతుందట.
అలాగే కొబ్బరిలో ఉండే సహజ చక్కెరలు స్థిరమైన శక్తిని అందించి, ఆకస్మికంగా చక్కెర లెవల్స్ పడిపోవడాన్ని నివారిస్తుందని చెబుతున్నారు నిపుణులు
తయారీ విధానం:
ఇంట్లో దీన్ని ఎలా తయారు చేయాలంటే..
కావలసినవి: 1 కప్పు తాజా కొబ్బరి నీరు (240 మి.లీ)
2 టేబుల్ స్పూన్లు తాజా నిమ్మరసం
1 టీస్పూన్ తేనె లేదా బెల్లం సిరప్
చిటికెడు నల్ల ఉప్పు లేదా కొన్ని పుదీనా ఆకులు
తయారీ: కొబ్బరి నీటిలో నిమ్మరసం వేసి బాగా కలపండి. కావాలనుకుంటే తేనె లేదా బెల్లం కూడా కలుపుకోవచ్చు. చల్లగా కావాలనుకుంటే కొంచెం ఐస్, పుదీనా రెమ్మతో సర్వ్ చేసుకోవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాల కోసం 1/2 టీస్పూన్ తురిమిన అల్లం కూడా జోడించొచ్చు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తి గత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీపావళి ‘స్వీట్’ వార్నింగ్..!)