పీజీ మెడికల్ కోర్సులకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఐఎన్‌ఐ సెట్–2025లో ఆలిండియా 7వ ర్యాంకు పొంది వార్తల్లో నిలిచింది డాక్టర్ సాయి త్రిషారెడ్డి. కిందటి నెలలో విడుదలైన ఈ ఫలితాలలో తొలి ప్రయత్నంలోనే దక్షిణాదిలో మొదటి ర్యాంకు సాధించింది. హైదరాబాద్‌లోని బీరంగూడలో ఉంటున్న సాయి త్రిషారెడ్డి న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ హౌస్ సర్జన్‌గా చేస్తోంది. ‘కత్తిని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలిసినట్టే యువతకు ఆన్‌లైన్‌ను ఉపయోగించడం కూడా అంతే స్మార్ట్‌గా తెలిసి ఉండాలి’ అంటూ తన ప్రిపరేషన్ వర్క్ గురించి తెలిపింది..
‘‘మాది ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా గురజాల. అమ్మా నాన్నలు బారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, అనంత లక్ష్మీ నా చిన్నతనంలోనే హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. నాన్న బిజినెస్ రంగంలో ఉండగా, అమ్మ స్కూల్ టీచర్. కుటుంబ నేపథ్యంలో ఎవరూ డాక్టర్లు లేరు. నాన్న స్నేహితుల్లో డాక్టర్లు ఉండటం చూసి, నేనూ వైద్యవృత్తిపై ఆసక్తి పెంచుకున్నాను.
ఇండియాలోనే పేరొందిన ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేయాలనే ప్రయత్నం ఫలించాక, నా లక్ష్య సాధనలో సరైన దిశగా ఉన్నాను అనిపించింది. 2020 నీట్ ఫలితాల్లో 14వ ర్యాంకు, మహిళల విభాగంలో 6 వ ర్యాంకు వచ్చింది. ఈ యేడాది ఐఎన్‌ఐ–సెట్‌లో ఆల్ ఇండియా 7వ ర్యాంకు, దక్షిణాదిన నేనొక్కదాన్నే నిలవడం మరింత సంతోషాన్నిచ్చింది.
సోషల్ మీడియాకు దూరం
న్యూ ఢిల్లీ ఎయిమ్స్‌లో హౌస్‌సర్జన్‌గా వర్క్ చేస్తూనే పీజీ ఎంట్రన్స్‌కి ప్రిపేర్ అవుతూ వచ్చాను. ఏదీ ఎవరికీ సులువుగా రాదు, దానికి తగిన క్రమశిక్షణతో ప్లానింగ్ చేసుకోవడమే మన ముందున్న మార్గం. ప్రిపరేషన్‌కి రోజూ ఒకే టైమ్ దొరికేది కాదు. వర్క్ షిఫ్టులు మారుతూ ఉండేవి. ఆరు గంటలు వర్క్, మిగతా టైమ్‌లో ప్రిపరేషన్ ప్లానింగ్‌కి కేటాయించుకున్నాను. ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు, కొన్నియాప్స్ గైడ్‌లైన్స్ తీసుకున్నాను. సోషల్‌మీడియాకు మాత్రం పూర్తి దూరంగా ఉన్నాను.
ఒత్తిడిగా అనిపించినప్పుడు మాత్రం వాకింగ్, కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్, అమ్మానాన్నలతో మాట్లాడటం మాత్రమే చేశాను. దాదాపు 9 నెలల ప్రిపరేషన్ నన్ను నా లక్ష్య సాధనకు చేరువచేసింది. దాదాపు ఈ ఎగ్జామ్‌కు దేశవ్యాప్తంగా ఎనిమిది వేల మందికి పైగా హాజరయ్యారు. ఎంత పెద్ద పరీక్ష, ఎంత మంది పాల్గొంటున్నారు.. అనే భయం ఏ విషయంలోనూ ఎప్పుడూ సరైనది కాదు. నాలో ఉన్న శక్తి ఎంత... అనేదానిపైనే దృష్టి పెట్టాను. అదే ఈ రోజు నన్ను అగ్రస్థానంలో ఉంచింది’ అని తెలినారు ఈ యువ వైద్యురాలు.
ఐఎన్‌ఐ సెట్‌లో దక్షిణ భారత దేశం నుండి పాల్గొన్న అభ్యర్థులలో ఏకైక మహిళా డాక్టర్‌గా తన ప్రతిభను చాటుకొని తెలుగు వారికి గర్వ కారణమయ్యింది. ఎయిమ్స్ న్యూ ఢిల్లీలో వైద్య విద్యార్థి గానే కాకుండా అందరిలోనూ ఉత్తమ ఫలితాలను సాధించి భవిష్యత్ డాక్టర్లకు స్ఫూర్తిగా నిలిచింది.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి


