సాక్షి, అనంతపురం: అనంతపురం జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అరటి రైతు నాగలింగం (40) ఆత్మహత్య నేపథ్యంలో ఆసుపత్రికి వెళ్లిన మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకులు సాకే శైలజానాథ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా రైతు కుటుంబాన్ని ప్రరామర్శిస్తే తప్పేంటని శైలజానాథ్ ప్రశ్నించారు.
వివరాల ప్రకారం.. శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య రైతు నాగలింగం (40) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు రైతు మృతదేహాన్ని పరిశీలించేందుకు జీజీహెచ్ వచ్చేందుకు మాజీ మంత్రి శైలజానాథ్ సిద్ధమయ్యారు. శైలజానాథ్ వస్తున్న కారణంగా ఉదయం 8 గంటలకే రైతు నాగలింగం మృతదేహాన్ని పోలీసులు తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శైలజానాథ్ తక్షణమే జీజీహెచ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు.. జీజీహెచ్ బయటే శైలజానాథ్‌ను అడ్డుకున్నారు. దీంతో.. పోలీసులు, శైలజానాథ్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. రైతు కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శిస్తే తప్పేంటి? అని పోలీసులను ఆయన నిలదీశారు. ఇంత హడావుడిగా నాగలింగం మృతదేహానికి పోస్టుమార్టం చేసి.. తరలించాల్సిన అవసరం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఇదే సమయంలో జీజీహెచ్‌కు వచ్చిన శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణితో ైశైలజానాథ్ మాట్లాడారు. నాగలింగం కుటుంబాన్ని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆమెకు సూచించారు.
అనంతరం, శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు సర్కార్ నిర్వాకం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అరటి రైతు నాగలింగం ఆత్మహత్య బాధాకరం. రైతు నాగలింగం మృతదేహానికి తెల్లవారుజామునే పోస్ట్ మార్టం నిర్వహించటం ఏంటి?. రైతులను వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించకూడదా?. చంద్రబాబు ప్రభుత్వ తీరు అమానవీయం’ అంటూ మండిపడ్డారు.


