యథేచ్ఛగా మాస్‌ కాపీయింగ్‌ | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా మాస్‌ కాపీయింగ్‌

Dec 5 2025 6:41 AM | Updated on Dec 5 2025 6:41 AM

యథేచ్

యథేచ్ఛగా మాస్‌ కాపీయింగ్‌

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న మూడు, ఐదు సెమిస్టర్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ యథేచ్ఛగా జరుగుతోంది. గురువారం నాటి పరీక్షల్లో ఏకంగా 17 మంది విద్యార్థులు డీబార్‌ అయ్యారు. అనంతపురం ఎస్‌ఎల్‌ఎన్‌ డిగ్రీ కళాశాలలో నలుగురు, గుత్తి ఎంఎస్‌ డిగ్రీ కళాశాలలో ముగ్గురు, హిందూపురం బాలయేసు డిగ్రీ కళాశాలలో ఇద్దరు, బాలాజీ విద్యా మందిర్‌లో ఎనిమిది మంది మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడటంతో వారిని డీబార్‌ చేసినట్లు ఎస్కేయూ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ జీవీ రమణ తెలిపారు.

రికార్డుల సవరణకు అవకాశం

అనంతపురం సిటీ: పాఠశాల రికార్డుల్లో విద్యార్థులు, తల్లిదండ్రుల పేర్లు, ఇతర వివరాలలో తప్పుల సవరణకు అవకాశం కల్పించినట్లు డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు. రికార్డులను సవరించే అధికారాన్ని మండల, డిప్యూటీ విద్యాధికారులు, గ్రేడ్‌–2 ప్రధానోపాధ్యాయులకు కల్పిస్తూ విద్యా శాఖ నుంచి తమకు ఆదేశాలు అందినట్లు వివరించారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు రికార్డుల్లో తప్పుల సవరించుకోవడానికి గడువు ఇచ్చారన్నారు.

చదువుల పండుగకూ కటకటే!

నేడు మెగా పేరెంట్‌, టీచర్స్‌ మీటింగ్‌

అనంతపురం సిటీ: పిల్లల చదువులెట్ల సాగుతున్నాయి.. బడిలో.. తరగతి గదిలో వారి ప్రవర్తన ఎలా ఉంటోంది.. వారు ఇంట్లో ఎలా మసలుకుంటున్నారు.. వారి భవిష్యత్‌కు ఏం చేస్తే.. ఎలా చేస్తే బాగుంటుందో చర్చించేందుకు మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ (పీటీఎం–3.0) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 1,752 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు 3 లక్షల మంది దాకా సమావేశానికి హాజరుకానున్నారు. అయితే ప్రభుత్వం జిల్లాకు రూ.49.82 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. అరకొర డబ్బుతో సమావేశాలు ఎలా నిర్వహించాలంటూ ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

అనంతపురం అర్బన్‌: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశించారు. కలెక్టర్‌ గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎస్పీ పి.జగదీష్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మురళీకృష్ణతో కలిసి జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్డు భద్రతా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. నగర పరిధిలో గుర్తించిన 23 పార్కింగ్‌ ప్రదేశాలను నెల రోజుల్లోగా అందుబాటులోకి తేవాలన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. రాప్తాడు వద్ద రైల్వే బ్రిడ్జిని రెండు వారాల్లో ప్రారంభించాలన్నారు.

మాదకద్రవ్యాలకు అడ్డుకట్టవేయాలి

మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలకు అడ్డుకట్టవేయాలని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ఎస్పీ జగదీష్‌తో కలిసి నార్కో కో ఆర్డినేషన్‌ సెంటర్‌ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై ‘నశా ముక్త్‌ భారత్‌’లో భాగంగా పోలీసు శాఖతో అన్ని శాఖలు సమన్వయం చేసుకుని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

8న పీజీలో స్పాట్‌ అడ్మిషన్లు

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌ కళాశాలలో పీజీ కోర్సుల్లో మిగులు సీట్లను స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఎస్కేయూ డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ప్రొఫెసర్‌ నరసింహన్‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

తీవ్ర జ్వరంతో చిన్నారి మృతి

ఉరవకొండ(విడపనకల్లు): తీవ్ర జ్వరంతో బాధపడుతూ రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. వివరాలు... విడపనకల్లుకు చెందిన వినోద్‌, వసంత దంపతులకు రెండేళ్ల వయసున్న కుమార్తె తనుశ్రీ ఉంది. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కుమార్తెకు తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. గురువారం జ్వరం తీవ్రం కావడంతో వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యం అందేలోపు చిన్నారి మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

యథేచ్ఛగా మాస్‌ కాపీయింగ్‌ 1
1/1

యథేచ్ఛగా మాస్‌ కాపీయింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement