కూడేరు: స్థానిక మన గ్రోమోర్ ఎరువుల దుకాణంలో బుధవారం యూరియా పంపిణీ ప్రక్రియ గందరగోళానికి దారితీసింది. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ధ సంఖ్యలో తరలి వచ్చారు. ఒక్కో రైతుకు ఒక బస్తా ఇవ్వాలనే నిబంధన ఉందని మేనేజర్ దిలీప్ ప్రకటించడంతో రైతులు అసహనానికి గురయ్యారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. రెండు మూడు రోజులుగా కొందరు రైతులకు 2 నుంచి 6 బస్తాల వరకు పంపిణీ చేసి, ఇప్పుడు ఒక బస్తానే అంటే ఎలా అంటూ నిలదీశారు. ఈ అంశంపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. వాస్తవానికి మార్చి 25న సుమారు 12 టన్నుల యూరియా కూడేరులోని మన గ్రోమోర్ దుకాణానికి సరఫరా అయింది. అయితే యూరియా కోసం వచ్చిన రైతులకు ఏప్రిల్ 1 నుంచి పంపిణీ చేస్తామంటూనే కొందరు రైతులకు లోగుట్టుగా సరఫరా చేస్తూ వచ్చారు. ఆదివారం ముద్దలాపురానికి చెందిన ఒకే రైతుకు ఏకంగా 6 బస్తాల యూరియా ఇవ్వడం వివాదానికి కారణమైంది.


