● శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ నిర్ణయంతో 30 మంది బదిలీ
అనంతపురం సెంట్రల్: రాజకీయ సిఫారసులకు చెక్ పెడుతూ శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ తనదైన మార్క్‌ను చూపించారు. వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న 30 మందికిపైగా కానిస్టేబుళ్లకు స్థాన చలనం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే... జిల్లాల విభజన సమయంలో శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించిన కానిస్టేబుళ్లలో 30 మందికి పైగా అక్కడ పనిచేయడానికి అయిష్టత వ్యక్తం చేస్తూ రాజకీయ నాయకులతో సిఫారుసులతో అనంతపురం జిల్లాలోని వివిధ పీఎస్‌ల్లో తిష్ట వేశారు. వీరందరూ ఆయా పీఎస్‌ల్లో బాస్‌లకు అత్యంత కీలకమైన వారుగా చలామణి అవుతున్నారు. అనంతపురం వన్‌టౌన్ పీఎస్‌లోనే నలుగురు కానిస్టేబుళ్లు తిష్టవేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఓ కానిస్టేబుల్ ఇక్కడ పనిచేయడానికి ఇతర జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా నేరుగా డీజీపీ కార్యాలయం నుంచి సిఫారసు చేయించాడంటే వన్‌టౌన్ పీఎస్‌కు డిమాండ్ ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్పీ సతీష్‌కుమార్ శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించిన కానిస్టేబుళ్లందరూ తక్షణమే అక్కడ రిపోర్టు చేసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆ జిల్లాకు సదరు కానిస్టేబుళ్లు ఏకమై శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేతో సంప్రదించి ఎస్పీ సతీష్‌కుమార్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకెళ్లినట్లు సమాచారం. అయినా ఎస్పీ సతీష్‌కుమార్ తలొగ్గకుండా ఆ కానిస్టేబుళ్లందరూ శ్రీసత్యసాయి జిల్లాలోనే విధులు నిర్వర్తించాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం కానిస్టేబుళ్ల వంతు కాగా, తర్వాత మిగిలిన కేడర్‌లోనూ స్థాన చలనం తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎస్పీ సతీష్‌కుమార్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం పోలీస్ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది.
వ్యక్తి దుర్మరణం
బత్తలపల్లి: మండలంలోని 42వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరంలోని గాండ్లవీధికి చెందిన బలిజ చింతా చిన్న కొండప్ప(36) స్థానికంగా ఓ సిల్క్ హౌస్‌లో గుమాస్తాగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం అనంతపురానికి ద్విచక్ర వాహనంపై వెళ్లిన కొండప్ప... అక్కడ పని ముగించుకుని తిరుగు ప్రయాణమై బత్తలపల్లి మండలం సంజీవపురం సమీపంలోకి చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో కాటికోటేశ్వరక్షేత్రానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన ఆర్చ్‌ను ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కొండప్ప భార్య గీత, కుటుంబసభ్యులు బంధువులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. బత్తలపల్లి ఎస్‌ఐ సోమశేఖర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి కేసు నమోదు చేశారు.


