ఇది దోపిడీ ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ఇది దోపిడీ ప్రభుత్వం

Apr 2 2026 7:35 AM | Updated on Apr 2 2026 7:35 AM

రాప్తాడు రూరల్‌: రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం రాజ్యమేలుతోందని మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లూ చాలా క్రమశిక్షణతో ప్రభుత్వాన్ని నడిపారని గుర్తు చేశారు. సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో బుధవారం రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్‌సీపీ సర్పంచులకు అనంతపురం రూరల్‌ పరిధిలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌లో సన్మాన సభ ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిశీలకులు రమేష్‌రెడ్డి హాజరయ్యారు. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. కరోనా కష్టకాలం, ఆదాయం లేకపోవడం, నిధుల లేమి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల బాగాలేకపోవడంతో గ్రామాల్లో ఆశించిన మేర అభివృద్ధి పనులు జరగలేదన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసిన అందరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని, ప్రస్తుతం సర్పంచులగా పనిచేసిన వారందరికీ రానున్న రోజుల్లో మరింత గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఎంపీటీసీ, సర్పంచుల ఎన్నికలకు చేతనైన మేరకు సాయం చేశామన్నారు. గౌరవం నిలబడేలా గుడికో, బడికో, ఆస్పత్రులకో ఇతర వాటి కోసమే రూ.కోట్లలో ఖర్చు చేశామన్నారు. తనకు జగన్‌మోహన్‌రెడ్డితో ఉన్న అనుబంధం భగవంతుడు, భక్తుడికి ఉన్న బంధం లాంటిదన్నారు. రాజకీయాల్లోకి రాకముందే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టానన్నారు. పరిటాల కుటుంబం అంటే ప్రజల్లో ఉన్న భయాన్ని తాము దూరం చేస్తూ వచ్చామన్నారు. వారు మనుషులను చంపుతూ భయభ్రాంతులకు గురి చేసి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పరిటాల కుటుంబం ధర్మవరం పోయినా, పెనుకొండకు పోయినా, రాప్తాడు నుంచి పోటీ చేసినా ఓడించి తీరుతామన్నారు. పరిటాల ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు కురుబ లింగమయ్యను హతమార్చారన్నారు. రాబోవు ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయలేమని భావించే పరిటాల కుటుంబం రాప్తాడు, అనంతపురం రూరల్‌, ఆత్మకూరు మండలాల్లో దోపిడీలకు తెరలేపిందన్నారు. వారిలా హత్యలతో భయభ్రాంతులకు గురి చేసి జనాలను తాను లోబర్చుకోలేదన్నారు. తాను ఆర్థికంగా చెడిపోయినా రైతులకు మేలు చేశానన్నారు. జనాలకు ప్రేమతో దగ్గరయ్యానన్నారు. నేటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నామని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో జరిగిన కొన్ని పొరబాట్లను సరిదిద్దుకుంటామన్నారు. ఈసారి అసెంబ్లీ సీట్లు పెరగనున్న నేపథ్యంలో గ్రేటర్‌ రాయలసీమలో 111లో కనీసం 106 స్థానాలు వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుంటుందని పేర్కొన్నారు. జగన్‌ పాలన కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఆయనపైనే అన్ని వర్గాల ప్రజలు నమ్మకం పెట్టుకున్నారన్నారు. అనంతరం మండలాల వారీగా సర్పంచులను సన్మానించారు. కార్యక్రమంలో ఆహుడా మాజీ చైర్మన్‌ మహలక్ష్మీ శ్రీనివాస్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు కదిరి ఇస్మాయిల్‌, సానే రాజారెడ్డి, పేరూరు నాగిరెడ్డి, రంగంపేట గోపాలరెడ్డి, మదిగుబ్బ వీరాంజనేయులు, గంగుల సుధీర్‌రెడ్డి, అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మండలాల కన్వీనర్లు, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ప్రజలకు జరిగిన మేలు ఏదీ లేదు

వైఎస్‌ జగన్‌ క్రమశిక్షణతో ప్రభుత్వాన్ని నడిపారు

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే

తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement